ఆర్ధికం అస్తవ్యస్తం

ABN , First Publish Date - 2022-10-02T09:40:14+05:30 IST

‘రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భేష్‌! అంతా బ్రహ్మాండం’ అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నదంతా ఉత్తిదే అని తేలిపోయింది.

ఆర్ధికం అస్తవ్యస్తం

5 నెలల్లోనే 217 శాతానికి రెవెన్యూ లోటు


రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భేష్‌! అంతా బ్రహ్మాండం’ అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నదంతా ఉత్తిదే అని తేలిపోయింది. అభివృద్ధిని, సంపద సృష్టిని మరచిపోవడంతో సొంత ఆదాయం పడిపోయి... అలవికాని అప్పులతో ‘ఆర్థికం’ అతలాకుతల మవుతోంది. లోటు పెరిగి... మూలధన వ్యయం మూలనపడిందని ‘కాగ్‌’ తేల్చింది.


కొరవడ్డ క్రమశిక్షణ.. అభివృద్ధిపై ఆర్భాటం

మూలధన ఖర్చు కేవలం 19 శాతమే

భయపెడుతున్న అప్పుల కుప్పలు

91ు అప్పులు తీసేసుకున్న ప్రభుత్వం

తేల్చిన కాగ్‌.. 5 నెలల నివేదిక విడుదల


న్యూఢిల్లీ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని మరోసారి రుజువయింది. అభివృద్ధి విషయంలో జగన్‌ సర్కారువి  ఆర్భాటాలేనని తేలిపోయింది. అసాధారణ రీతిలో రాష్ట్ర రెవెన్యూ లోటు పెరగడమే దీనికి నిదర్శనమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. విచ్చలవిడిగా అప్పులు చేస్తూ, ఆదాయానికి మించి ఖర్చులు చేయడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ కొరవడింది. ఫలితంగానే రాష్ట్ర రెవెన్యూ లోటు గతి తప్పింది. 2022-23 ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ అంచనాలు, వాస్తవిక ఆదాయం, వ్యయాల లెక్కలపై తొలి ఐదు నెలలకు గాను (ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు) కాగ్‌ విడుదల చేసిన వివరాల ప్రకారం... రాష్ట్ర రెవెన్యూ లోటు 217.09 శాతానికి పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ. 17,036.15 కోట్లుగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొనగా... తొలి ఐదు నెలల్లో అది రెట్టింపయి, రూ. 36,983.28 కోట్లకు చేరుకుంది. బడ్జెట్‌లో ప్రతిపాదించినదాని కంటే ఇది 217.09 శాతం అదనం. ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే సరికి రెవెన్యూ లోటు ఇంకా కనీవినీ ఎరుగని స్థాయికి పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.ఇక ద్రవ్యలోటు కూడా దాదాపు బడ్జెట్‌ అంచనాలకు చేరువగా వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 4,8724.11 కోట్ల ద్రవ్యలోటు ఎదుర్కొంటామని బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించగా... తొలి ఐదు నెలల్లోనే రూ. 4,4582.58 కోట్లుగా అది నమోదయింది. అంటే బడ్జెట్‌లో ప్రతిపాదించినదానిలో 91.6శాతం లోటు ఐదు నెలల్లోనే పూర్తవడం గమనార్హం. 


91.5 శాతం అప్పులు తీసేసుకున్నారు...

ఇబ్బడిముబ్బడిగా జగన్‌ ప్రభుత్వం అప్పులు చేస్తున్నదని కాగ్‌ పత్రాలు వెల్లడించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం కలిపి రూ. 48724.12 కోట్ల అప్పులు చేస్తామని ప్రతిపాదించిన ప్రభుత్వం... తొలి ఐదు నెలల్లోనే రూ. 44582.58 కోట్ల అప్పులు చేసింది. బడ్జెట్‌లో ప్రతిపాదించినదానిలో 91.5 శాతం అప్పులు తీసుకుంది. ఇదే తరహాలో ఈ ఏడాది మిగతా కాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసే తీరు కొనసాగితే దాదాపు రూ. లక్ష కోట్ల అప్పులు ఒకేసారి చేసే అకాశముందని ఆర్థిక వర్గాలు అంటున్నాయి. కాగా, రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా ఏప్రిల్‌లో 13428.14 కోట్లు అప్పు చేయగా... జూలైలో 12137.79 కోట్లు, మే నెలలో రూ. 9532.82 కోట్లు, జూన్‌ నెలలో 7082.57 కోట్లు, ఆగస్టులో రూ. 2401.06 కోట్ల రుణాలు పొందింది. 


మూలధనవ్యయం 19 శాతమే...

ఉచితాలు, సంక్షేమ పథకాల పేరిట విచ్చలవిడిగా ఖర్చుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... ఆస్తుల సృష్టికి కీలకమైన మూల ధన వ్యయం మాత్రం చేయడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 30,679.57 కోట్ల మేర మూల ధన వ్యయం చేస్తామని బడ్జెట్‌లో ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం... తొలి ఐదు నెలల్లో కేవలం రూ. 6125.68 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అంటే బడ్జెట్‌లో ప్రతిపాదించినదానిలో ఖర్చు చేసింది కేవలం 19.97 శాతం మాత్రమే. 


ఆదాయం 59381 కోట్లు...

తొలి ఐదు నెలల్లో రాష్ట్ర ఖనానాకు పన్నులు, పన్నులేతర ఆదాయం కలిపి రూ. 59,381.45 కోట్లు సమకూరింది. ఇది మొత్తం బడ్జెట్‌ అంచనాల్లో 31.05 శాతం. జీఎస్టీ రూపంలో రూ. 15,608.88 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఫీజుల రూపంలో రూ. 3473.37 కోట్లు, భూ రెవెన్యూ ద్వారా రూ. 3.9 కోట్లు, సేల్స్‌ ట్యాక్స్‌ రూపేణా రూ. 7592.77 కోట్లు, రాష్ట్ర ఎక్సైజ్‌ డ్యూటీ కింద రూ. 6594.95 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా కింద రూ. 8209.41 కోట్లు, ఇతర పన్నులు, డ్యూటీల రూపంలో ఖనాజాకు రూ. 2016.45 కోట్ల ఆదాయం సమకూరగా... పన్నుయేతర రెవెన్యూ రూ. 1691.5 కోట్లు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో 14190.22 కోట్లు ఖజానాకు సమకూరిందని కాగ్‌ పత్రాలు తెలిపాయి.

Read more