Teesta Setalvad Case: తీస్తా సెతల్వాడ్ కేసులో 14 రోజుల రిమాండ్‌కు అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ అభ్యర్థన..
ABN , First Publish Date - 2022-06-27T01:26:21+05:30 IST
గుజరాత్ అల్లర్లకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై..

అహ్మదాబాద్: గుజరాత్ అల్లర్లకు (Gujarat Riots) సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన ప్రముఖ జర్నలిస్టు, సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్ (Teesta Setalvad) విచారణకు సహకరించడం లేదని గుజరాత్ పోలీసాధికారి చైతన్య మండ్లిక్ మీడియాకు తెలిపారు. అహ్మదాబాద్‌లో (Ahmedabad) ఆదివారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన డీసీపీ మండ్లిక్ మాట్లాడుతూ మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌బీ శ్రీకుమార్‌ను శనివారం అదుపులోకి తీసుకున్నామని, తీస్తా సెతల్వాడ్‌ను ఆదివారం అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఆమె విచారణకు సహకరించడం లేదని, అందువల్ల 14 రోజులు కస్టడీకి ఆమెను అప్పగించాలని కోరాలని నిర్ణయించినట్లు తెలిపారు. విచారణ ప్రాథమిక దశలో ఉందన్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో తదుపరి విచారణకు నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(SIT) అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ ఏర్పాటు చేసింది.
గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి క్లీన్ చీట్ ఇవ్వడాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించాక సెతల్వాడ్, భట్, శ్రీకుమార్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. గుజరాత్ అల్లర్లకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) తప్పుడు సమాచారం ఇచ్చారన్నది వీరిపై ప్రధాన అభియోగం. ఈ నేపథ్యంలో గుజరాత్ ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) పోలీసులు శనివారం ముంబైలోని శాంతాక్రజ్ ప్రాంతంలోని తీస్తా నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇవే ఆరోపణలపై మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్, మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌పైనా కేసు నమోదు చేశారు. వీరిలో సంజీవ్ భట్ ఇప్పటికే మరో కేసు కారణంగా జైల్లో ఉండగా శ్రీకుమార్‌ను కూడా శనివారం అరెస్టు చేశారు.
2002 గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి సిట్ క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించడం, ఈ కేసులో సహ పిటిషనర్‌గా ఉన్న తీస్తా సెతల్వాడ్ వైఖరిని తప్పుబట్టడం తెలిసిందే. ‘‘ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న కొందరు ఉన్నతాధికారులు ఇతరులతో కుమ్మక్కై కేసును సంచలనం చేయడానికి ప్రయత్నించారు. వారంతా అల్లర్ల విషయంలో సిట్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారు. కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన అధికారులను జైల్లో పెట్టా లి. అలాగే, సొంత ప్రయోజనాల కోసం తీస్తా సెతల్వాడ్ ఈ కేసును వాడుకున్నారు. ఆమెపైనా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది’’ అంటూ జకియా జాఫ్రీ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ, ప్రధాని మోదీకి సిట్ క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని సమర్ధిస్తూ శుక్రవారం సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక, గుజరాత్ అల్లర్ల కేసులో తీస్తా సెతల్వాడ్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ అధికారుల ఫిర్యాదు మేరకు సెతల్వాడ్, సంజీవ్ భట్, శ్రీకుమార్‌లపై గుజరాత్ ఏటీఎస్ కేసులు నమోదు చేసింది. మరణ శిక్ష విధించడానికి అవకాశమున్న నేరంలో కొందరు వ్యక్తులను దోషులుగా ఇరికించడానికి సెతల్వాడ్, సంజీవ్ భట్, శ్రీకుమార్ కుట్ర పూరితంగా తప్పుడు సాక్ష్యాలను పుట్టించి, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేశారని క్రైం బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ డీబీ బారాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అమాయక వ్యక్తులపై తప్పుడు, దురుద్దేశపూర్వక క్రిమినల్ ప్రొసీడింగ్స్ పెట్టారని, తద్వారా పలువురిని దెబ్బతీయాలని భావించారని, తప్పుడు రికార్డులను తయారు చేశారని పేర్కొన్నారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 468 (మోసం చేయడానికి ఫోర్జరీ చేయ డం); 471(ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్‌ను అసలు డాక్యుమెంట్‌గా ఉపయోగించడం); 194 (మరణ శిక్ష విధించేలా తప్పుడు సాక్ష్యం సృష్టించడం), 211 (గాయపరచడానికి క్రిమినల్ ప్రొసీడింగ్స్‌కు కారణం కావడం); 120(బి)(తప్పుడు ఆరోపణలు చేయడం) కింద కేసులు నమోదు చేశారు. ఆ వెంటనే సెతల్వాడ్‌ను, శ్రీకుమార్‌ను అరెస్టు చేశారు. సెతల్వాడ్‌ను ముంబై నుంచి అహ్మదాబాద్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో తీస్తాకు చెందిన స్వచ్ఛంద సంస్థ సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్(సీజేపీ) వ్యవహారాలపైనా దర్యాప్తు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తీస్తాపై విదేశీ సహకార నియంత్రణ చట్టం(ఎఫ్‌సీఆర్‌ఏ) కింద కేసు నమోదైంది. 2002 అల్లర్ల బాధితుల తరఫున నిర్వహిస్తున్న ఉద్యమానికి సహకారం పేరుతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం లేకుండానే విదేశాల నుంచి తీస్తా సెతల్వాడ్ నిధులు సేకరిస్తున్నారనే ఆరోపణలపై సీబీఐ 2015లో ఆమెపై కేసు నమోదు చేసింది. ఈ అంశం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.