తెలుగు.. ఒక జీవన విధానం!

ABN , First Publish Date - 2022-06-26T08:09:47+05:30 IST

మాతృభాషను మరిచిపోవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ చెప్పారు.

తెలుగు.. ఒక జీవన విధానం!

మాతృభాషను ఎన్నడూ మరవద్దు

తెలుగు రాష్ట్రాల్లో తెలుగు కోసం ఉద్యమించాల్సిన దుస్థితి ఏర్పడింది!

న్యూజెర్సీలో సీజేఐ ఎన్వీ రమణ 

న్యూఢిల్లీ, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): మాతృభాషను మరిచిపోవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ చెప్పారు. భాషా సంస్కృతులను మరిచిపోతే కొన్ని తరాల తర్వాత మన జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష కోసం ఉద్యమం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు చాలా చింతిస్తున్నట్లు చెప్పారు. ఇంగ్లిష్‌ భాష నేర్చుకుంటే తప్ప ఉద్యోగాలు రావన్న అపోహను సృష్టించారని వాపోయారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయనను ఉత్తర అమెరికా తెలుగు సమాజం న్యూజెర్సీలో సన్మానించింది. ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ మాట్లాడుతూ.. తెలుగు అనేది కేవలం భాష కాదన్నారు. అది ఒక జీవన విధానం, నాగరికత అని చెప్పారు. తెలుగు భాష అనేక పరిణామాలను, ఆటుపోట్లను తట్టుకొని అత్యంత నాగరిక భాషగా నిలబడిందని పేర్కొన్నారు. తెలుగు భాష మాట్లాడేవారికి తమ భాషనే గౌరవించాలన్న అహంకారపూరితమైన సంస్కృతి ఉండదని.. పరాయి భాషను కూడా తెలుగుతో సమానంగా గౌరవిస్తారని చెప్పారు. ‘‘అమ్మను ప్రేమించడం జీవుల సహజ లక్షణం. అది మనుషుల్లో బలంగా ఉంటుంది. మాతృభాషను, మాతృమూర్తిని పూజించుకోవడం ఒక ప్రత్యేకత. అమ్మ భాషలోని తియ్యదనం అనుభవించాల్సిందే కానీ మాటల్లో చెప్పలేం’’ అని అన్నారు. వృత్తిరీత్యా, ఇతర దేశాల్లో నివసిస్తుంటే వేరే భాషలను నేర్చుకోవాల్సి ఉంటుందని.. దైనందిన జీవితంలో మాత్రం మాతృభాషను మరవద్దని సూచించారు. ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలన్నారు. పిల్లలకు తెలుగులో కథలు, ఆచార వ్యవహారాలను చెప్పాలని, తెలుగు సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. డిగ్రీ వరకు తాను మాతృభాషలోనే చదువుకున్నానన్నారు. న్యాయవాద విద్యను మాత్రమే ఆంగ్ల మాధ్యమంలో చదివానని చెప్పారు. మాతృభాషలో చదవి కూడా తాను భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగానని తెలిపారు.


అమెరికాలో 7 లక్షలకు పైగా తెలుగువాళ్లు..

అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారతీయులు, తెలుగు వారు కీలక పాత్ర పోషించడం సంతోషకరమని జస్టిస్‌ రమణ అన్నారు. అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 85 శాతం పెరిగిందన్నారు. తెలుగువారంతా ఐకమత్యంగా ఉండాలన్నారు. తాను ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికీ న్యాయం అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. సప్తసముద్రాలు దాటి అమెరికా వచ్చి తెలుగు జాతి కీర్తి పతాకను ఎగరేస్తున్న ప్రవాసీయులను కలవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మాతృభూమిని, సంస్కృతిని, సొంత మనుషులను వదులుకొని ప్రతికూల వాతావరణంలో కష్టపడి పనిచేస్తున్నారని కొనియాడారు. ‘‘తెలుగు జాతి భవిష్యత్తు మీ అందరి చేతుల్లో సురక్షితంగా ఉంటుందని విశ్వసిస్తున్నా. పుట్టిన ఊరు, మట్టి వాసన, ఉపాధ్యాయులు, పొలాలు, చెరువు గట్లు, మైదానాలను మరిచిపోవద్దు. 42 లక్షల మంది భారతీయులు అమెరికాలో ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో 7 లక్షలకుపైగా తెలుగు వాళ్లు ఉండడం గర్వించదగ్గ విషయం. నేను ఇటీవల అనేక దేశాలు పర్యటించినప్పుడు భారతీయుల గురించి, తెలుగు వారి గురించి గొప్పగా విన్నాను. తెలుగు ప్రజలు క్రమశిక్షణతో జీవిస్తూ ఎంతో సంపదను సృష్టిస్తున్నారని, వారిని చూసి గర్విస్తున్నామని ఇటీవల దుబాయ్‌, యూఏఈలో పర్యటించినప్పుడు ఆ దేశాల రాజవంశీకులు, అధికారులు చెప్పారు. ఇదే విషయాన్ని నేను ప్రధాని, రాష్ట్రపతికి తెలియజేశాను’’ అని జస్టిస్‌ రమణ చెప్పారు.

Updated Date - 2022-06-26T08:09:47+05:30 IST