వృద్ధుల సంక్షేమంపై నివేదికలు సమర్పించండి
ABN , First Publish Date - 2022-10-07T09:30:47+05:30 IST
వృద్ధాశ్రమాలు, వృద్ధుల సంరక్షణ స్థాయి, పింఛన్లు తదితరాలకు సంబంధించిన సంక్షేమ పథకాల వివరాలను తమ ముందు ఉంచాలని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
వృద్ధాశ్రమాలు, వృద్ధుల సంరక్షణ స్థాయి, పింఛన్లు తదితరాలకు సంబంధించిన సంక్షేమ పథకాల వివరాలను తమ ముందు ఉంచాలని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం, నిర్వహణ చట్టం-2007 అమలు జరుగుతున్న స్థాయిని కూడా ఆ నివేదికల్లో వెల్లడించాలని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సుధాంశు ధులియాతో కూడిన సుప్రీం ధర్మాసనం నిర్దేశించింది. ‘రెండు నెలల్లో అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఆ సమాచారాన్ని సేకరించి, ఆ తర్వాత మరో నెలకు సవరించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం మా ముందు ఉంచాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ప్రాథమిక వైద్య సదుపాయాలతో కూడిన వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి అశ్వనీ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.