Chief Minister MK Stalin: మినహాయింపు లభిస్తుంది

ABN , First Publish Date - 2022-10-17T16:16:02+05:30 IST

నీట్‌ నుంచి రాష్ట్రానికి మినహాయింపు లభిస్తుందనే ఆశిస్తున్నానని, ఈ విషయంలో జరుగుతున్న జాప్యాన్ని మినహాయింపు లభించదని అనుమానపడకూడదని

Chief Minister MK Stalin: మినహాయింపు లభిస్తుంది

నీట్‌ వ్యవహారంపై స్టాలిన్‌

చెన్నై: నీట్‌ నుంచి రాష్ట్రానికి మినహాయింపు లభిస్తుందనే ఆశిస్తున్నానని, ఈ విషయంలో జరుగుతున్న జాప్యాన్ని మినహాయింపు లభించదని అనుమానపడకూడదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అన్నారు. ఆదివారం ఉదయం ‘మీలో ఒకడి సమాధానాలు’ పేరుతో  ఓ వీడియో విడుదల చేశారు. అందులో పలు  ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నీట్‌ను అమలులోకి తెచ్చి సామాజిక న్యాయానికి తీరని ద్రోహం చేసిందని, ఈ విషయమై లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీతో సఖ్యతగా మెలగుతున్నట్లు ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఆయన ఖండిస్తూ ఆ పార్టీతో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీజేపీతో దోస్తీగా ఉన్నామని చెబితే ఆ పార్టీ నాయకులే ఆగ్రహిస్తారని స్టాలిన్‌ వెల్లడించారు.


పార్టీ యువజన విభాగం, సాంకేతిక విభాగాలు ద్రావిడ ఉద్యమ సిద్ధాంతాలపై రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించి వ్యాప్తిచేస్తున్నాయని, ఆ సభలకు యువకులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారని తెలిపారు. నగరంలో వాననీటి నీటి కాల్వల మరమ్మతులకు రూ.4560 కోట్లను కేటాయించామని, ఇదే విధంగా రాష్ట మంతటా రహదారుల మరమ్మతులు, వాననీటి కాల్వల మరమ్మతులకు భారీగా నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని, నగరంలో వర్షాకాలానికి ముందే వాననీటి కాల్వల నిర్మాణ పనులను ముగించాలని అధికారులను ఆదేశించామన్నారు.పదిహేను మాసాల పాలనలో ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఎన్నికల హామీల్లో 70 శాతానికి పైగా నెరవేర్చామని, అన్ని వివరాలను ఒక్క మాటలో చెప్పాలంటే తమ పాలనలో ప్రజల ముఖాల్లో భయం తొలగి సంతోషం చోటుచేసుకుందన్నారు. అధికారంలోకి వచ్చినప్పుడు కరోనా ఉగ్రరూపం దాల్చిందని, ఆ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంపైనే దృష్టిసారించి ఎట్టకేలకు ఆ గండం నుండి ప్రజలను కాపాడగలిగామని చెప్పారు.


చురుకుదనం రహస్యమిదే...

ముఖ్యమంత్రిగా, డీఎంకే అధ్యక్షుడిగా ఎలప్పుడు చురుకుదనంగా ఎలా ఉండగలుగుతున్నారనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ అధికారంలో ఉన్నా లేకపోయాని తాను పార్టీ కార్యకలాపాలల్లో చురుకుగా పాల్గొంటానని, ప్రస్తుతం సీఎంగా అదనపు బాధ్యత కూడా నిర్వర్తిస్తున్నానని, వీటన్నింటికీ తోడు రోజూ రెండు పూటలా తాను వ్యాయామానికి అధిక ప్రాధాన్యత నిస్తానని వెల్లడించారు. ఉదయం వ్యాయామం సాయంత్రం వాకింగ్‌ తప్పకుండా చేస్తానని, పరిమితమైన ఆహారాన్ని భుజిస్తానని, ఇదే తన చురుకుదనం వెనుక దాగిన రహస్యమని స్టాలిన్‌ వెల్లడించారు. ఇక ప్రత్యర్థులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలపై ఆయన స్పందిస్తూ పాలనకు సంబంధించిన విమర్శలను మాత్రమే తాను పట్టించుకుంటానని, వ్యక్తిగతంగా చేసే విమర్శలను ఓర్వలేనితనంతో చేస్తున్నారని భావించి పెద్దగా పట్టించుకోనని స్టాలిన్‌ స్పష్టం చేశారు.


ఒడిశా సీంఎంకు శుభాకాంక్షలు

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు సీఎం స్టాలిన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే విషయంపై ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సీఎం నవీన్‌ పట్నాయక్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ప్రకృతి వైపరీత్యాలను సమర్థమంతంగా ఎదుర్కోవడం, క్రీడలను ప్రోత్సహించడం, ఎంతో మంది ఔత్సాహికుల ప్రశంసలు అందుకుంటున్న నవీన్‌ పట్నాయక్‌ సంపూర్ణ ఆరోగ్యంతో రాష్ట్ర పురోగతి కోసం పాటుపడాలని కోరుకుంటున్నాను’ అని సీఎం స్టాలిన్‌ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-10-17T16:16:02+05:30 IST