Lockdown అవసరం లేదు..
ABN , First Publish Date - 2022-01-09T14:10:47+05:30 IST
ప్రభుత్వ ఆంక్షలను ప్రజలు విధిగా పాటిస్తే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రం లో మరో సంపూర్ణ లాక్డౌన్ అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్

- ప్రభుత్వ ఆంక్షలను విధిగా పాటించాలి
- డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్
అడయార్(చెన్నై): ప్రభుత్వ ఆంక్షలను ప్రజలు విధిగా పాటిస్తే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రం లో మరో సంపూర్ణ లాక్డౌన్ అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ అభిప్రాయ పడ్డారు. ఈ వైరస్ ప్రజలతో శాశ్వతంగా సహజీవనం చేస్తుందని వెల్లడించారు. తిరువాన్మియూరులో ఒక ఎన్జీవో సంస్థ నిర్మించిన పార్కును ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ జె.రాధాకృష్ణన్, చెన్నై కార్పొరేషన్ కమిషనర్ గగన్‌దీప్ సింగ్ బేడీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌమ్యా స్వామినాథన్ మీడియాతో మాట్లాడుతూ... దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసిన తొలి దశలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట ఏవిధంగా వేయాలన్న అంశంపై పెద్దగా అవగాహన లేకపోవడంతో దేశంలో సంపూర్ణ లాక్డౌన్ అవసరమైందన్నారు. కానీ, ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా వైద్య మౌలిక సదుపాయాలు గణనీయంగా పెరిగాయన్నారు. అందువల్ల ఇపుడు సంపూర్ణ లాక్డౌన్ అక్కర్లేదన్నారు. డెల్టా వైరస్‌తో పోలిస్తే ఒమైక్రాన్ వైరస్ వ్యాప్తి నాలుగు రెట్లు అధికంగా ఉందన్నారు. అయినప్పటికీ వైద్య సహాయం అవసరమయ్యే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. అందువల్ల కరోనా థర్డ్ వేవ్ వ్యాప్తిని అరికట్టేందుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి లాక్డౌన్ అవసరం రాదన్నారు. ప్రస్తుత పరిస్థితులను అధికమించేందుకు ప్రభుత్వం విధించిన ఆంక్షలను ప్రజలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. 60 యేళ్ళు పైబడిన వృద్ధులతోపాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నవారు విధిగా బూస్టర్ డోస్ కరోనా టీకా వేయించుకోవం ఎంతో మంచిదన్నారు. అలాగే, ఆయా సీజన్లలో ప్రబలే అంటు వ్యాధులను గుర్తించేందుకు ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ‘ప్రజల వద్దకే వైద్యం’ ఎంతో మంచిదని ఆమె కొనియాడారు. ఈ కరోనా వైరస్ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుంటాయని, అందువల్ల కరోనా వైరస్ ప్రజలతో కలిసి ప్రయాణి స్తుందని, వైరస్ బారినపడకుండా ఉండాలంటే స్వీయ రక్షణ చర్యలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ సూచించారు.