Siddhu Moosewala Murder: ఆరుగురి అరెస్టు

ABN , First Publish Date - 2022-05-30T21:51:10+05:30 IST

సంచలనం సృష్టించిన పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక పరిణామం..

Siddhu Moosewala Murder: ఆరుగురి అరెస్టు

డెహ్రాడూన్: సంచలనం సృష్టించిన పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్యతో ప్రమేయం ఉన్నట్టుగా అనుమానిస్తున్న ఆరుగురిని ఉత్తరాఖండ్, పంజాబ్ సంయుక్త పోలీసు బృందం అరెస్టు చేసింది. డెహ్రాడూన్‌లో వీరిని అదుపులోకి తీసున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ పోలీస్ వర్గాలు ధ్రువీకరించాయి. ఉత్తరాఖండ్ ఎస్‌టీఎఫ్, పంజాబ్ పోలీసులు ఆకస్మిక దాడులు జరిపి నిందితులను అరెస్టు చేశారని, ఇంటరాగేషన్ కోసం వారిని పంజాబ్‌కు తరలిస్తున్నారని ఆ వర్గాలు చెప్పాయి.


పంజాబ్ ప్రభుత్వం మూసేవాలాకు భద్రతను తగ్గించిన 24 గంటల్లోపే గ్యాంగ్‌స్టర్లు కాల్చిచంపడం సంచలనమైంది. తమ పూర్వీకుల స్వగ్రామమైన మాన్సాకు ఎస్‌యూవీలో మూసేవాలా వెళ్తుండగా సుమారు 10 నుంచి 12 మంది వ్యక్తులు అతన్ని అడ్డుకుని అతి సమీపం నుంచి ఆయనపై 20 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మూసేవాలా అక్కడికక్కడే కుప్పకూలగా, ఆయన మిత్రులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, కెనడాకు చెదిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్‌లు ఈ హత్య చేసింది తామేనంటూ ప్రకటించారు. మూసేవాలా హత్యా ఘటన అటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర సంచలనం రేపింది. పంజాబ్ ప్రభుత్వం ఈ హత్యను సవాలు తీసుకుని, హంతకులు ఎంతవారైనా విడిచిపెట్టేది లేదని ప్రకటించింది. హంతకుల కోసం పంజాబ్ పోలీసులు జల్లెడపడుతున్నారు.

Updated Date - 2022-05-30T21:51:10+05:30 IST