SI, Constable: ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ సేవాభావం

ABN , First Publish Date - 2022-10-11T14:40:20+05:30 IST

ఎవరూ లేక ప్రభుత్వ ఆస్పత్రిలో మార్చురీలో మగ్గుతున్న అనాధ శవాలకు తమ సొంత ఖర్చుతో అంత్యక్రియలు నిర్వహించి సేవాభావం చాటుకుంటున్న

SI, Constable: ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ సేవాభావం

- అనాథ శవాలకు అంత్యక్రియలు 

- పలువురి ప్రశంస 


చెన్నై, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ఎవరూ లేక ప్రభుత్వ ఆస్పత్రిలో మార్చురీలో మగ్గుతున్న అనాధ శవాలకు తమ సొంత ఖర్చుతో అంత్యక్రియలు నిర్వహించి సేవాభావం చాటుకుంటున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్‌(SI, Constable)ను పలువురు ప్రశంసిస్తున్నారు. తంజావూరు మార్చురీలోని అనాథ శవాలకు ఓ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ కలిసి సొంత ఖర్చుతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ వీరిద్దరూ 150 అనాథశవాలకు అంత్యక్రియలు చేశారు. తాజాగా తంజావూరు వైద్యకళాశాల ఆస్పత్రి మార్చురీలో గుర్తు తెలియని 32 శవాలకు అంత్యక్రియలు చేసేందుకు ఆ కళాశాల ఆస్పత్రి పోలీస్ స్టేషన్‌(Police station)లో పనిచేస్తున్న ఎస్‌ఐ మనోహరన్‌, కానిస్టేబుల్‌ రఘునాథన్‌ నడుంకట్టారు. ఆ మేరకు ఆసుపత్రి నిర్వాహకులు ఆ 32 శవాలకు సంబంధించిన వివరాలతో జిల్లా అంతా నోటీసులు అతికించారు. వారం లోగా ఆ శవాల కోసం ఎవరూ రాకపోతే ఖననం చేస్తామని పేర్కొన్నారు. తరువాత ఆ శవాల కోసం ఎవరూ రాకపోవడంతో ఎస్‌ఐ మనోహరన్‌, కానిస్టేబుల్‌ రఘునాథన్‌ అంబులెన్స్‌ల్లో 32 శవాలను శాంతివనం శ్మశానవాటికకు తరలించి సామూహికంగా ఖననం చేశారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి పురోహితుల చేత సంప్రదాయంగా కర్మకాండ జరిపించారు. ఈ విషయమై ఎస్‌ఎ మనోహరన్‌ మాట్లాడుతూ యేళ్ల తరబడి మార్చురీల్లో అనాథ శవాలకు సొంత ఖర్చులతో  సేవాభావంతో అంత్యక్రియలు చేస్తున్నామని, ప్రస్తుతం ఓ స్వచ్చంద సంస్థ కూడా తమకు సహకరించేందుకు ముందుకు వచ్చిందన్నారు. తంజావూరు వైద్యకళాశాల ఆస్పత్రిలో మూడేళ్లుగా 32 శవాల కోసం ఎవరూ రాకపోవడంతో కానిస్టేబుల్‌, తాను కలిసి వాటికి అంత్యక్రియాలు చేస్తామని వైద్యాధికారులకు చెప్పి ఆ సేవ చేశామన్నారు.

Updated Date - 2022-10-11T14:40:20+05:30 IST