ED Summons Sanjay Raut's Wife : సంజయ్ రౌత్ భార్యకు ఈడీ సమన్లు
ABN , First Publish Date - 2022-08-05T00:27:15+05:30 IST
ఈడీ(ED) కస్టడీలో ఉన్న శివసేన(Shivasena) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) భార్య వర్షా రౌత్‌కు(Varsha Raut) ఈడీ సమన్లు జారీ చేసింది.
న్యూఢిల్లీ : ఈడీ(ED) కస్టడీలో ఉన్న శివసేన(Shivasena) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) భార్య వర్షా రౌత్‌కు(Varsha Raut) ఈడీ సమన్లు జారీ చేసింది. హౌసింగ్ స్కాం(Housing Scam) ఆరోపణలపై మనీల్యాండరింగ్ చట్టాల కింద చేపడుతున్న దర్యాప్తులో భాగంగా ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. ముంబైలోని ప్రత్యేక కోర్టు గురువారం సంజయ్ రౌత్ ఈడీ కస్టడీని ఆగస్టు 8 వరకు పొడిగించిన గంటల వ్యవధిలోనే భార్యకు నోటీసులు ఇవ్వడం గమనార్హం. అయితే వర్షా రౌత్ ఏ తేదీలో విచారణ రావాలని కోరిందో తెలియరాలేదు. హౌసింగ్ స్కాం దర్యాప్తులో వర్షా రౌత్ పేరుని ఈడీ పలుమార్లు పేర్కొంది. కానీ ఇప్పటివరకు ప్రశ్నించలేదు.
కాగా ముంబై(Mumbai)లోని గోరేగావ్ ప్రాంతంలో ‘పాత్ర చావల్’ ప్రాజెక్ట్ పునరుద్ధరణలో రూ.1000 కోట్ల కుంభకోణం జరిగిందని 4 నెలల క్రితమే ఈడీ ఆరోపించింది. దర్యాప్తులో భాగంగా వర్షా రౌత్‌తోపాటు సంజయ్ రౌత్ సహాయకులకు చెందిన రూ.11 కోట్ల విలువైన ఆస్తులను జప్తు కూడా చేసింది. ఈ జాబితాలో దాదర్‌లో ఒక ఫ్లాట్, అలీబాగ్‌లో 8 ఫ్లాట్లను స్వప్న పాట్కర్‌తో వర్షా రౌత్ ఉమ్మడిగా నిర్వహిస్తోందని ఈడీ అభియోగాలు మోపింది. సంజయ్ రౌత్‌కు అత్యంత సన్నిహితుడైన సుజిత్ పాట్కర్ భార్యే స్వప్న పాట్కర్. ఈ కేసులో ఆమె సాక్షిగా ఉన్నారు. గత నెలలో ఆమెకు హత్య, అత్యాచారం బెదిరింపులు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని సంజయ్ రౌత్ చెప్పారు.
వెంటిలేషన్ లేని గదిలో ఉంచారు: రౌత్
పాత్ర చావల్ ప్రాజెక్ట్‌ను నిబంధనలకు విరుద్ధంగా చేపట్టేందుకు సంజయ్ రౌత్ కుటుంబానికి రూ.1 కోటి ముడుపులు అందాయని ముంబైలోని ప్రత్యేక కోర్టుకు ఈడీ గురువారం తెలిపింది. కాగా కనీసం వెంటిలేషన్ కూడా లేని గదిలో తనను ఉంచారని సంజయ్ రౌత్ కోర్టుకి తెలిపారు. ఈ ఆరోపణను ఈడీ కొట్టివేసింది. గదికి కిటీకీ లేకపోయినా ఏసీ ఉందని తెలిపింది. కాగా 60 ఏళ్ల సంజయ్ రౌత్ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రేకి ఆయన అత్యంత సన్నిహితుడు. బీజేపీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే ఈడీతో దాడుల చేయిస్తోందని శివసేన చెబుతోంది.