Japan ప్రధాన మంత్రిగా షింజో అబే రికార్డు

ABN , First Publish Date - 2022-07-08T18:04:28+05:30 IST

జపాన్‌కు సుదీర్ఘ కాలం ప్రధాన మంత్రిగా సేవలందించిన ఘనత

Japan ప్రధాన మంత్రిగా షింజో అబే రికార్డు

టోక్యో : జపాన్‌కు సుదీర్ఘ కాలం ప్రధాన మంత్రిగా సేవలందించిన ఘనత షింజో అబే (Shinzo Abe)కు దక్కింది. ఆయన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంతోపాటు ముఖ్యమైన దౌత్య సంబంధాలను ఏర్పరచుకుని దేశానికి లబ్ధి చేకూర్చారు. మరోవైపు ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. ఆయన శుక్రవారం ఓ ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. 


జపాన్ ప్రధాన మంత్రిగా షింజో అబే 2006లో తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని అలంకరించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు.  మార్పునకు గుర్తుగా ఆయనను పరిగణిస్తారు. ఓ సంప్రదాయ సంపన్న  కుటుంబంలో మూడో తరం వ్యక్తి అయిన అబేను బాల్యం నుంచి రాజకీయ నేతగా తీర్చిదిద్దారు. 


మొదటిసారి ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఆ పదవీ కాలంలో ఆయన సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. అవినీతి కుంభకోణాల్లో చిక్కుకున్నారు. అకస్మాత్తుగా రాజీనామా చేయవలసి వచ్చింది. రాజకీయ కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కానీ తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని ఆ తర్వాత ఆయన చెప్పారు. కొన్ని నెలలపాటు ఆయన చికిత్స పొందారు. 2012లో మళ్ళీ ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు. ఆ సమయంలో సగటున ఏడాదికొకరు  చొప్పున ప్రధాన మంత్రి పదవిని చేపడుతూ ఉండేవారు. 2011లో వచ్చిన సునామీ, ఆ తర్వాత ఫొకుషిమాలో అణు విపత్తు పర్యవసానాలు జపాన్‌పై తీవ్రంగా ఉన్నాయి. అప్పట్లో అబే సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించారు. 


అబెనామిక్స్ 

జపాన్ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసేందుకు షింజో అబే విశేష కృషి చేశారు. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ జపాన్‌దే. అయితే దాదాపు రెండు దశాబ్దాలపాటు తీవ్రమైన ఒడుదొడుకుల్లో చిక్కుకుంది. ప్రభుత్వ వ్యయాన్ని పెంచవలసి వచ్చింది. ద్రవ్యపరమైన నిబంధనలను సడలించి, రెడ్ టేపిజానికి అడ్డుకట్ట వేశారు. 


తల్లిదండ్రులకు అనుకూలంగా కార్యాలయాలు

పని చేసే చోటుకు తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న తల్లులకు అనుకూల ప్రదేశాలుగా కార్యాలయాలను తీర్చిదిద్దారు. నర్సరీలకు నిధులు ఇవ్వడానికి, సాంఘిక భద్రతా వ్యవస్థలో లోపాలను సరిదిద్దడానికి వివాదాస్పద కన్జంప్షన్ ట్యాక్స్ పెంపును అమలు చేశారు. ఈ సంస్కరణల కారణంగా కొంత ప్రగతి కనిపించినప్పటికీ, ఆర్థిక వ్యవస్థలో తిష్ఠవేసుకుని కూర్చున్న నిర్మాణ సంబంధిత సమస్యలు యథాతథంగా కొనసాగాయి. 2020లో కోవిడ్-19 మహమ్మారి రావడానికి ముందే జపాన్ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో ఉండేది. 


కీర్తి ప్రతిష్ఠల పతనం

అబే కీర్తిప్రతిష్ఠలు ఈ మహమ్మారి కాలంలో దిగజారాయి. ఆర్థిక వ్యవస్థలో ఆయన చేపట్టిన సంస్కరణలు తీవ్ర విమర్శలపాలయ్యాయి. ఆయన అప్రూవల్ రేటింగ్స్ అథమస్థాయికి చేరాయి. 


ఉత్తర కొరియాపై కఠిన వైఖరి, ట్రంప్‌తో మైత్రి

షింజో అబే ఉత్తర కొరియా విషయంలో కఠిన వైఖరిని అవలంబించారు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి స్థాపకుని పాత్రను కోరుకున్నారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహిత వ్యక్తిగత సంబంధాలను ఏర్పరచుకున్నారు. కానీ జపాన్‌లోని అమెరికన్ దళాలకు మరింత ఎక్కువ నిధులు చెల్లించాలని ట్రంప్ పట్టుబట్టారు. రష్యా, చైనాలతో సత్సంబంధాల కోసం కృషి చేశారు.


షింజో అబే 2006 నుంచి 2007 వరకు; ఆ తర్వాత 2012 నుంచి 2020 వరకు ప్రధాన మంత్రి పదవిని నిర్వహించారు. జపాన్ చరిత్రలో ఇంత సుదీర్ఘ కాలం ప్రధాన మంత్రి పదవిని చేపట్టినవారు ఆయనే. 


 

Read more