Chandigarh University ‘leaked’ video case: యువతి బాయ్‌ఫ్రెండ్ అరెస్ట్! సిమ్లా యువకుడి అరెస్ట్

ABN , First Publish Date - 2022-09-19T00:58:08+05:30 IST

దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న చండీగఢ్ యూనివర్సిటీ ‘లీక్‌డ్’ వీడియో కేసులో సిమ్లా యువకుడిని పోలీసులు

Chandigarh University ‘leaked’ video case: యువతి బాయ్‌ఫ్రెండ్ అరెస్ట్! సిమ్లా యువకుడి అరెస్ట్

చండీగఢ్: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న చండీగఢ్ యూనివర్సిటీ ‘లీక్‌డ్’ వీడియో కేసులో సిమ్లా యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇది రెండో అరెస్ట్. హాస్టల్‌‌లోని సహచర విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలు తీసిన విద్యార్థిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వ్యక్తికి ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థినికి ఇది వరకే తెలుసని పంజాబ్ పోలీసులు తెలిపారు.  


సిమ్లా కుర్రాడు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతితో పరిచయం ఉందన్న కమ్యూనిటీ అఫైర్స్ డివిజన్ ఏడీజీపీ గురుప్రీత్ దేవ్.. అతడిని అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఇంతకుముందు పేర్కొన్నారు. యువతి మొబైల్‌కు ఫోరెన్సిక్ దర్యాప్తు నిర్వహించనున్నట్టు తెలిపారు.  


చండీగఢ్ యూనివర్సిటీలో అసలేం జరిగింది?

యూనివర్సిటీ హాస్టల్‌లోని ఓ విద్యార్థిని తన సహచర విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలను చిత్రీకరించిన విషయం వెలుగులోకి రావడంతో  కలకలం రేగింది. వారి అభ్యంతరకర వీడియోలు వెలుగులోకి రావడంతో వందలాదిమంది విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన  పోలీసులు నిందితురాలిని  అరెస్ట్ చేశారు. కాగా, వెలుగులోకి వచ్చిన వీడియో ‘పర్సనల్ వీడియో’ అని యూనివర్సిటీ తెలిపింది. నిందితురాలైన విద్యార్థిని దానిని సిమ్లాలోని తన బాయ్‌ఫ్రెండ్‌కు పంపిందని చండీగఢ్ యూనివర్సిటీ ప్రొ చాన్స్‌లర్ ఆర్ బవా పేర్కొన్నారు.


మొత్తంగా 60 అభ్యంతరకర ఎంఎంఎస్‌లు సోషల్ మీడియాకెక్కాయన్న వార్త మాత్రం నిజం కాదని కొట్టిపడేశారు. యూనివర్సిటీ నిర్వహించిన ప్రాథమిక విచారణలో అలాంటి ఒక్క వీడియో కూడా లేదని తేలిందన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతి షూట్ చేసుకున్న వీడియోను తన బాయ్‌ఫ్రెండ్‌కు పంపిందని, ఆ ఒక్కటి తప్ప మరేదీ లేదని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-09-19T00:58:08+05:30 IST