‘చిన్నమ్మ’ పర్యటన షురూ

ABN , First Publish Date - 2022-03-05T14:03:05+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు, అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆమె శుక్రవారం నుంచి మూడు జిల్లాల పర్యటనకు

‘చిన్నమ్మ’ పర్యటన షురూ

                         - అన్నాడీఎంకేలో ప్రకంపనలు!


అడయార్‌(చెన్నై): మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు, అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆమె శుక్రవారం నుంచి మూడు జిల్లాల పర్యటనకు బయలు దేరివెళ్లారు. ముందుగా తిరుచ్చెందూరు ఆలయంలో స్వామిదర్శనం చేసుకున్న అనంతరం తూత్తు కుడి, తిరునల్వేలి, తెన్‌కాశి జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం చెన్నై నుంచి బయలుదేరుతూ ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే కుటుం బంలోని ప్రతి సభ్యుడినీ కలుసుకుంటానని, వారందరి తో సమావేశమవుతానని చెప్పారు. కాగా, ఇటీవల రాష్ట్రంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అన్నాడీఎంకే చిత్తుగా ఓడిపోయింది. పార్టీకి సరైన నాయకత్వం లేకనే ఈ పరిస్థితి ఎదురైందనే విమర్శలు వచ్చాయి. అదేసమయంలో పార్టీలోకి శశికళతోపాటు టీటీవీ దినకర్‌లను చేర్చుకోవాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో మూడు జిల్లాల పర్యటన కోసం ఆమె చెన్నై నుంచి బయలుదేరి వెళ్ళారు. ఆమె తన పర్యటనలో తొలుత తూత్తుకుడి జిల్లాలోని విశ్వామిత్ర ఆలయంలో శుక్రవారం సాయంత్రం పూజలు చేశారు. శనివారం ఉదయం 7.30 గంటలకు తిరుచ్చెందూరు నుంచి బయలుదేరి నెల్లై చేరుకుని అక్కడ నుంచి ఆలంకుళం, పావూర్‌సత్రం సహా పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత తెన్‌కాశి జిల్లాలో ప్రవేశిస్తారు. అక్కడ కడయనల్లూరు, పులియంకుడి, వాసుదేవనల్లూరు, శివగిరి, రాజపాళయం, శ్రీవిల్లిపుత్తూరు, టికల్లుపట్టి, తిరుమంగళం బైపాస్‌ మీదుగా మదురై ఎయిర్‌పోర్టుకు చేరుకుని చెన్నై తిరిగి వస్తారు. 


నిర్ణయం మార్చుకున్న ఓపీఎస్‌

మున్సిపల్‌ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు ఎదురైన ఓటమిపై చర్చిందుకు ఆ పార్టీ సమన్వ యకర్త, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం పార్టీ కార్య నిర్వాహకులతో శనివారం నిర్వహించదలచిన సమావేశాన్ని ఆకస్మికంగా రద్దు చేసుకున్నారు. ఈ సమావేశాన్ని తేని జిల్లా పెరియకుళంలోని తన ఫామ్‌హౌస్‌లో ఈ నెల 5వ తేదీన జరుగుతుందని ముందు ప్రకటించారు. అన్నాడీఎంకే కంచుకోటగా ఉన్న కొంగు మండలం మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార డీఎంకే విజయఢంకా మోగించింది. దీన్ని అన్నాడీఎంకే శ్రేణులు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నాయి. మరోవైపు, శశికళను, తనను అన్నాడీఎంకేలో చేర్చుకుంటే ఏఎంఎంకేను అన్నాడీఎంకేలో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తామని టీటీవీ దినకరన్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఓపీఎస్‌ నిర్వహించతలపెట్టిన సమావేశంపైనే ప్రతి ఒక్కరూ దృష్టిసారించారు. కానీ, ఓపీఎస్‌ ఉన్నట్టుండి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. 


అన్నాడీఎంకేలో ప్రకంపనలు!

శశికళ పర్యటనతో అన్నాడీఎంకేలో ప్రకంపనలు రేగుతున్నాయి. ఆమె జిల్లాల్లో పర్యటించినప్పుడు ఏఏ నేతలు ఆమెను కలుసుకుంటారోనని మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆరా తీస్తున్నారు. ముఖ్యనేతలెవ్వరూ ఆమెను కలుసుకోకుండా ఇప్పటికే మౌఖిక ఆదేశాలు కూడా జారీ చేసినట్లు సమాచారం. అయితే పార్టీ భారీ ఓటమి, తగిన నాయకత్వలేమి తదితరాలతో తీవ్ర నిరాశలో వున్న అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు ఎడప్పాడి మాటల్ని ఏ మేరకు ఖాతరు చేస్తారో వేచిచూడాల్సివుంది.

Read more