రౌత్‌పై ఈడీ చర్యను మోదీ దృష్టికి తెచ్చా: పవార్

ABN , First Publish Date - 2022-04-07T01:46:35+05:30 IST

శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీసుకున్న చర్య 'అన్యాయం' అని..

రౌత్‌పై ఈడీ చర్యను మోదీ దృష్టికి తెచ్చా: పవార్

న్యూఢిల్లీ: శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీసుకున్న చర్య 'అన్యాయం' అని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. సంజయ్ రౌత్, ఆయన కుటుంబానికి చెందిన ఆస్తుల జప్తు అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువచ్చినట్టు ఆయన చెప్పారు. ప్రధానితో పవార్ బుధవారంనాడు సుమారు 25 నిమిషాల పాటు సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇలాంటి చర్యకు ఒక కేంద్ర సంస్థ తీసుకుంటే, దానికి వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే రౌత్‌పై ఈడీ చర్య తీసుకుందని పవార్ ఆరోపించారు. రౌత్‌పై ఈడీ చర్యను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదని పవార్ తెలిపారు.


మనీ లాండరింగ్ కేసులో భాగంగా సంజయ్ రౌత్ భార్య, ఆయన ఇద్దరు అసోసియేట్లకు చెందిన రూ.11.15 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారంనాడు సీజ్ చేసింది. ఈడీ చర్యపై సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. తాను బాలాసాహెబ్ ఫాలోయర్‌నని, శివసైనికుడినని, తనను కాల్చినా, జైలుకు పంపినా భయపడేది లేదని,  నిజానికే ఎప్పటికీ గెలుపని అన్నారు. ఈడీలోని కొందరు అవినీతి అధికారులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వాటిపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తారని, కొందరు జైలుకు కూడా వెళ్తారని ఇటీవల సంజయ్ రౌత్ చెప్పారు. అందుకు అనుగుణంగానే రౌత్ ఆరోపణలపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు మహారాష్ట్ర సర్కార్ మంగళవారంనాడు ప్రకటించింది. దీనికి కొద్దిసేపటికి ముందే రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు.

Updated Date - 2022-04-07T01:46:35+05:30 IST