శభాష్ ముస్కాన్!
ABN , First Publish Date - 2022-04-07T09:52:15+05:30 IST
కర్ణాటకలో హిజాబ్ వివాదంపై అల్‌ఖాయిదా చీఫ్ ఆయిమన్ అల్ జవహరీ స్పందించాడు.

కర్ణాటక విద్యార్థినికి అల్‌ఖాయిదా చీఫ్ జవహరీ ప్రశంసలు
జిహాద్ స్ఫూర్తిని కొనసాగించిందంటూ హర్షం
బెంగళూరు, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో హిజాబ్ వివాదంపై అల్‌ఖాయిదా చీఫ్ ఆయిమన్ అల్ జవహరీ స్పందించాడు. ఈ అంశంపై జవహరీ మాట్లాడిన 9 నిమిషాల వీడియో అల్‌ఖాయిదా సొంత మీడియా అస్-సహబ్లో విడుదలైంది. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నవారి ఎదురుగా నిలబడి ‘అల్లాహు అక్బర్’ అంటూ నినదించిన విద్యార్థిని ముస్కాన్‌ను జవహరీ అందులో ప్రశంసించాడు. ఆమె వీడియోను సోషల్ మీడియాలో చూశానంటూ ఆమె ధైర్యంపై పొగడ్తలు కురిపించాడు. ఆమెను సోదరిగా అభివర్ణించాడు.
‘ది నోబెల్ ఉమెన్ ఆఫ్ ది ఇండియా’ అని ప్రశంసించాడు. ఆమె జిహాద్ స్ఫూర్తిని కొనసాగించిందని, ముస్లిం సమాజాన్ని మేల్కొల్పిందని పేర్కొన్నాడు. భారతదేశంలోని ముస్లింలపై ప్రభుత్వం దమనకాండ ప్రయోగిస్తోందని ఆరోపించాడు. దీన్ని తిప్పికొట్టేందుకు దేశంలోని ముస్లింలంతా యుద్ధం చేయాలని పిలుపునిచ్చాడు. ఇంటలెక్చువల్‌గా మీడియానూ ఉపయోగించుకోవాలని, ఆయుధాలతోనూ యుద్ధరంగంలోకి దిగాలని సూచించాడు. ‘వాస్తవాన్ని ముస్కాన్ వెలుగులోకి తెచ్చింది.
ముస్లింలకు, బహుదైవారాధకులకు నడుమ శత్రుత్వాన్ని బట్టబయలు చేసింది. భారతదేశంలోని మోసపూరిత అన్యమత ప్రజాస్వామ్యాన్ని వెలుగులోకి తెచ్చినందుకు దేవుడు ఆమెకు తగిన ప్రతిఫలం ఇవ్వుగాక’ అని జవహరీ ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఆమె తనకు ప్రేరణ కలిగించిందని, దీంతో ఆమెపై ఓ పద్యం కూడా రాశానని పద్యం చదివి వినిపించాడు. తన బహుమతిగా ఆ పద్యాన్ని ఆమె స్వీకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా.. హిజాబ్‌పై జవహరీ వీడియోతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. హిజాబ్ వంటి భావోద్వేగ అంశాన్ని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు ఉపయోగించుకుంటున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు.. జవహరీ వీడియోపై కర్ణాటకలో విమర్శలు హోరెత్తాయి. దేశ ఆంతరంగిక విషయాలలో జోక్యం సరికాదని కర్ణాటక మంత్రి అశ్వత్థనారాయణ కౌంటర్ ఇచ్చారు.
అతనెవరో తెలియదు: ముస్కాన్ తండ్రి
ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని, తమకు ఎవరి సాయమూ వద్దని ముస్కాన్ తండ్రి మొహమ్మద్ హుస్సేన్ ఖాన్ విన్నవించారు. తమను ప్రశాంతంగా బతకనివ్వాలని కోరారు. ముస్కాన్‌ను జవహరీ ప్రశంసించడంపై మీడియా ఆయనను ప్రశ్నించగా, ‘ఆ వీడియోలో అతనేదో అరబీలో మాట్లాడాడు. మనమంతా ఈ దేశంలో శాంతియుతంగా జీవిస్తున్నాం. మనలో విభేదాలు సృష్టించే ప్రయత్నమే ఇది’ అన్నారు.