హిజాబ్ వివాదం: హోలీ సెలవుల తర్వాత సుప్రీం విచారణ

ABN , First Publish Date - 2022-03-16T21:55:27+05:30 IST

హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌పై..

హిజాబ్ వివాదం: హోలీ సెలవుల తర్వాత సుప్రీం విచారణ

న్యూఢిల్లీ: హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌పై విచారణను హోలీ సెలవుల తర్వాత సుప్రీంకోర్టు చేపట్టనుంది. ఈ కేసుపై తక్షణ విచారణ జరపాలని  సీనియర్ అడ్వకేట్ సంజయ్ హెగ్డే విజ్ఞప్తి చేయగా, హోలీ సెలవుల తర్వాత లిస్టింగ్ చేద్దాం..అని‌ భారత ప్రధాన న్యాయవాది ఎన్‌వీ రమణ ఆయనకు తెలియజేశారు. హోలీ సందర్భంగా 17వ తేదీ గురువారం నుంచి మూడు రోజుల పాటు కోర్టుకు సెలవులు. 21న తిరిగి తెరుస్తారు.
కాగా, కర్ణాటక విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడంపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని హైకోర్టు మంగళవారంనాడు సమర్ధించింది. దీన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్లను కొట్టివేసింది. హైకోర్టు తీర్పు చెప్పిన కొద్ది గంటలకే కర్ణాటక ముస్లిం విద్యార్థిని నిబా నాజ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాలు చేశారు. హిజాబ్ ధరించడం అనేది భావప్రకటనా స్వేచ్ఛ అని, రాజ్యాంగంలోని 19(1)(ఏ) నిబంధన కిందకు వస్తుందని, కోర్టు ఈ విషయాన్ని పరిగణనలో తీసుకోలేదని ఆమె అన్నారు. హిజాబ్ ధరించడం అనేది రాజ్యాంగంలోని 25వ అధికరణ చెబుతున్న "రైట్ టు కన్‌సైన్స్'' కిందకు కూడా వస్తుందన్నారు. ఇది వ్యక్తిగత హక్కు అని పేర్కొన్నారు. మతపరంగా తప్పనిసరా కాదా అనేది కోర్టు ఇలాంటి సందర్భాల్లో అప్లయ్ చేయరాదని అన్నారు.  కాగా, హైకోర్టు తీర్పుపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. తీర్పును మహిళా సాధికారత కోణంలో డాలే కానీ, రాజకీయ కోణంలో చూడరాదని అన్నారు.Read more