Satyaprad Sahu: ఓటరు జాబితాలో సవరణకు 7 లక్షల మంది దరఖాస్తు

ABN , First Publish Date - 2022-11-15T08:34:45+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా శని, ఆదివారాల్లో ఓటర్ల జాబితాల్లో పేర్ల చేర్పులు, మార్పుల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుచేశారు. వీటిద్వారా 7.20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రద సాహు(Satyaprad Sahu)

Satyaprad Sahu: ఓటరు జాబితాలో సవరణకు 7 లక్షల మంది దరఖాస్తు

- ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రద సాహు వెల్లడి

అడయార్‌(చెన్నై), నవంబరు 14: రాష్ట్ర వ్యాప్తంగా శని, ఆదివారాల్లో ఓటర్ల జాబితాల్లో పేర్ల చేర్పులు, మార్పుల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుచేశారు. వీటిద్వారా 7.20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రద సాహు(Satyaprad Sahu) ప్రకటించారు. రాష్ట్రంలో గత నెల 29వ తేదీ అన్ని జిల్లాల్లో ఓటర్ల ముసాయిదా జాబితా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ జాబితా ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 6,18,26,182 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 3,03,95,103, మహిళలు 3,14,23,321, హిజ్రాలు 7,758 మంది ఉన్నారు. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక ఓటర్ల సెగ్మెంట్‌గా చెంగల్పట్టు జిల్లాలోని షోళింగనల్లూరు నిలిచింది. ఇక్కడ మొత్తం 6,66,464 మంది ఓటర్లున్నారు. అలాగే, అతి తక్కువ ఓటర్లు చెన్నై హార్బర్‌ నియోజకవర్గంలో కేవలం 1,72,211 మంది మాత్రమే ఉన్నారు.

2 రోజుల్లో లక్షల్లో దరఖాస్తులు..

ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా తయారీతో పాటు కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు కోసం ప్రత్యేక శిబిరాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 12, 13 తేదీలతో పాటు 26, 27వ తేదీల్లో కూడా ప్రత్యేక శిబిరాలను నిర్వహించనుంది. ఇందులోభాగంగా శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక శిబిరాల్లో ఏకంగా 7,20,274 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు కోసం 4,44,019 మంది దరఖాస్తు చేసుకోగా, ఆధార్‌ నంబరు అనుసంధానానికి 67,943 మంది, పేర్లను తొలగించాలని 77,698 మంది, ఇంటి చిరునామా మార్పు కోసం 1,30,614 మంది కలిపి మొత్తం 7,20,274 మంది దరఖాస్తు చేసుకున్నారని సత్యప్రద సాహు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

జనవరి 5న తుది జాబితా...

కొత్తగా తయారు చేసే ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునే యువతీ యువకులు జనవరి ఒకటో తేదీ లేదా ఏప్రిల్‌ ఒకటో తేదీ లేదా జూన్‌ ఒకటో తేదీ, అక్టోబరు ఒకటో తేదీకి 18 యేళ్ళు నిండివుండాలన్నారు. ఇందుకోసం ఫాం 6ను సమర్పించాలని కోరారు. తుది ఓటర్ల జాబితా 2023 జనవరి 5వ తేదీ వెల్లడిస్తామని ఆయన ప్రకటించారు.

జత చేయాల్సిన ధ్రువపత్రాలు..

ఓటర్ల జాబితాలో కొత్తగా తమ పేర్లను నమోదు కోరుతూ దరఖాస్తు చేసుకునే యువత విధిగా తమ ఇంటి చిరునామా ధ్రువీకరణ కోసం ఆధార్‌ కార్డు, విద్యుత్‌ బిల్లు లేదా గ్యాస్‌ బిల్లు ఏదో ఒకదాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, 25 యేళ్ళలోపున్నవారు పుట్టినతేదీ సర్టిఫికెట్‌తో పాటు ఫొటోను జత చేయాల్సి ఉంటుంది.

Updated Date - 2022-11-15T08:34:47+05:30 IST