పసివాళ్లపై పైశాచికత్వం

ABN , First Publish Date - 2022-10-07T09:06:06+05:30 IST

థాయ్‌లాండ్‌లో ఓ మాజీ పోలీసు అధికారి మారణకాండకు తెగబడ్డాడు. చైల్డ్‌ కేర్‌ సెంటర్‌లోకి చొరబడి రక్తపాతం సృష్టించాడు.

పసివాళ్లపై పైశాచికత్వం

థాయ్‌లాండ్‌లో మాజీ పోలీసు మారణకాండ

24 మంది చిన్నారులు సహా 37 మంది మృతి

చైల్డ్‌ కేర్‌ సెంటర్‌లోకి వెళ్లి కాల్పులు, కత్తిపోట్లు

తర్వాత కారులో వెళుతూ కనిపించిన వాళ్లపైనా..

ఇంటికెళ్లి భార్య, కొడుకును చంపి, ఆత్మహత్య


బ్యాంకాక్‌, అక్టోబరు 6: థాయ్‌లాండ్‌లో ఓ మాజీ పోలీసు అధికారి మారణకాండకు తెగబడ్డాడు. చైల్డ్‌ కేర్‌ సెంటర్‌లోకి చొరబడి రక్తపాతం సృష్టించాడు. అభంశుభం తెలియని పసివాళ్లపై తూటాల వర్షం కురిపించాడు. కత్తితో పొడిచాడు. అప్పటిదాకా కేరింతలు కొడుతున్న పిల్లలు పిట్టల్లా రాలిపోయారు. నెత్తుటి మడుగుల్లో విగతజీవులై తేలారు. తర్వాత ఆ ఉన్మాది అక్కడ నుంచి కారులో వెళుతూ నరమేఽధాన్ని కొనసాగించాడు. దారిలో కనిపించిన వాళ్లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. బుల్లెట్లు దిగి కొందరు రోడ్డుమీదే ప్రాణాలు కోల్పోయారు. చివరగా తన భార్యని, కొడుకునీ చంపి, ఆత్మహత్య చేసుకున్నాడు.


మహా విషాదాన్ని మిగిల్చిన ఈ నరమేధంలో 24 మంది చిన్నారులు సహా 37 మంది మృత్యువాతపడ్డారు. 12 మంది గాయపడ్డారు. థాయ్‌లాండ్‌లోని నాంగ్‌బువా లాంఫు నగరంలో గురువారం ఈ ఘోరం చోటుచేసుకుంది. మాజీ పోలీసు అధికారి అయిన 34 ఏళ్ల పాన్య కామ్రప్‌ మధ్యాహ్నం కారులో అక్కడి చైల్డ్‌ కేర్‌ సెంటర్‌కు వచ్చాడు. పిల్లల ఆటపాటలతో సందడిగా ఉన్న ఆ భవనంలోకి హ్యాండ్‌గన్‌తో వడివడిగా నడిచాడు. అతన్ని చూసి తమకు అనుమానం వచ్చిందని, తలుపునకు తాళం వేశామని చైల్డ్‌ కేర్‌లో పనిచేస్తున్న ఓ మహిళ తెలిపారు. కానీ అది కామ్ర్‌పను ఆపలేకపోయింది. తాళాన్ని పేల్చేసి, కొంతమంది పిల్లలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఇంకొంత మందిని కత్తితో పొడిచి చంపాడు. ఒకరూ ఇద్దరూ కాదు 24 మంది ముక్కుపచ్చలారని పిల్లలు బలైపోయారు. వారిలో ఎక్కువ మంది 2 నుంచి 5 ఏళ్లలోపు వారే. వారి దేహాలు తూటాలు దిగి, కత్తిపోట్లతో ఛిద్రమయ్యాయి. ఆ నేలంతా నెత్తుటి మడుగులతో నిండిపోయింది. ఇద్దరూ టీచర్లు కూడా చనిపోయారు. ఓ టీచర్‌ తన చేతుల్లో చిన్నారిని పట్టుకునే ప్రాణాలు విడిచింది. తర్వాత ఆ ఉన్మాది కామ్రప్‌ కారులో తన ఇంటికి బయలుదేరాడు. దారిలో కనిపించినవాళ్లపై కారులో నుంచే కాల్పులు జరిపాడు.


ఇంటికి వెళ్లిన కామ్రప్‌ తన భార్యను, కొడుకును నిర్దాక్షిణ్యంగా చంపాడు. తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. కామ్రప్‌ 9ఎంఎం పిస్టల్‌, కత్తి వంటి ఆయుధాలతో ఈ మారణకాండకు పాల్పడ్డాడు. డే కేర్‌లో కాకుండా బయట భార్య, కొడుకు సహా ఇద్దరు పిల్లల్ని, తొమ్మిది మంది పెద్దవాళ్లను పొట్టనపెట్టుకున్నాడు. డ్రగ్స్‌ వాడినట్టు తేలడంతో అతన్ని కొన్నాళ్ల కిందట విధుల నుంచి తొలగించారు. ఆ కేసులో గురువారం అతను కోర్టుకు హాజరుకావలసి ఉందని పోలీసులు చెబుతున్నారు. కానీ అతను చైల్డ్‌ కేర్‌ సెంటర్‌పై విరుచుకుపడ్డాడు. సెంటర్‌లో 30 మంది పిల్లలు ఉన్నారు. పిల్లల్ని ఈ సెంటర్‌లో వదిలి ఉద్యోగాలకు వెళ్లిన తల్లిదండ్రులకు ఈ వార్త తెలిసి గుండెలు పగిలిపోయాయి. పిల్లల  మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదించారు. రెండేళ్ల క్రితం 2020లో కూడా థాయ్‌లాండ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నఖోన్‌ రట్చసిమా నగరంలోని మాల్‌లో ఓ సైనికుడు జరిపిన కాల్పుల్లో 26 మంది మరణించారు. 50మందికి పైగా గాయపడ్డారు. అతన్ని భద్రతా బలగాలు కాల్చిచంపాయి. ఆ దారుణాన్ని మర్చిపోకముందే మరో నరమేధం పెను విషాదంలోకి నెట్టేసింది.

Read more