Azam Khan: ఆజంఖాన్‌కు షాక్.. మూడేళ్ల జైలు శిక్ష

ABN , First Publish Date - 2022-10-27T17:47:02+05:30 IST

విద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్‌(Azam Khan)కు భారీ షాక్ తగిలింది. ఆయనను దోషిగా

Azam Khan: ఆజంఖాన్‌కు షాక్.. మూడేళ్ల జైలు శిక్ష

బరేలీ: విద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్‌(Azam Khan)కు భారీ షాక్ తగిలింది. ఆయనను దోషిగా నిర్ధారించిన రాంపూర్‌లో ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అదే సమయంలో కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేయడం గమనార్హం. 2019లో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, అప్పటి కలెక్టర్ ఆంజనేయకుమార్ సింగ్‌పై ఆజంఖాన్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు సెక్షన్ 153ఎ (రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం), సెక్షన్ 505-1(దుష్ప్రచారానికి దారితీసేలా ప్రసంగించడం) తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే సెక్షన్ 125 కింద కూడా కేసు నమోదైంది.

ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఆజంఖాన్‌పై నమోదైన మూడు సెక్షన్లలోనూ ఆయనను దోషిగా తేల్చి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. మూడేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆజంఖాన్ తన శాసనసభ్యత్వాన్ని కోల్పోక తప్పదు. 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ/ఎంపీ కనుక క్రిమినల్ కేసులో దోషిగా తేలి రెండేళ్ల జైలు శిక్ష పడితే కనుక సభ్యత్వాన్ని కోల్పోతారు. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది.

తీర్పు రావడానికి ముందే ఆజంఖాన్ కోర్టులో లొంగిపోయారు. కోర్టు వర్గాల ప్రకారం.. ఈ కేసులో మొత్తం 21 మంది సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. ఆజంఖాన్‌పై అవినీతి, దొంగతనం సహా దాదాపు 90 కేసులు ఉన్నాయి. చీటింగ్ కేసులో జైలుకెళ్లిన ఆజంఖాన్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంతో రెండేళ్ల జైలు జీవితం తర్వాత ఈ ఏడాది మొదట్లో విడుదలయ్యారు.

Updated Date - 2022-10-27T17:47:04+05:30 IST