కీవ్‌లో రష్యా మారణకాండ

ABN , First Publish Date - 2022-03-16T07:55:55+05:30 IST

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంలో రష్యా సేనలు మంగళవారం మారణకాండ సృష్టించాయి. ..

కీవ్‌లో రష్యా మారణకాండ

నగరంలోకి ప్రవేశించిన సేనలు.. విధ్వంసం.. 15 కిమీ దూరంలో భారీ సేనల కదలికలు

ఛికీవ్‌, మార్చి 15: ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంలో రష్యా సేనలు మంగళవారం మారణకాండ సృష్టించాయి. ఇంతకాలం కీవ్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారీ రష్యా సేనలు(7.5 కిలోమీటర్లకు పైగా రహదారి నిండా సైన్యం) సోమవారం అర్ధరాత్రి నుంచి ముందుకు కదిలాయి. మంగళవారం ఉదయానికి కీవ్‌కు వాయవ్య, నైరతి ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల దూరంలో నిలిచాయి. మరికొన్ని సేనలు కీవ్‌ నడిబొడ్డుకు చేరుకున్నాయి. వచ్చే దారి పొడవునా విధ్వంసకాండను కొనసాగించాయి. మైకొలైవ్‌, ఖార్కివ్‌, ఖేర్సన్‌, మారియుపోల్‌ నగరాల్లోనూ రష్యా వైమానిక దళాల దాడులు కొనసాగాయి. ప్నిప్రో నగరంలోని విమానాశ్రయాన్ని ధ్వంసం చేశాయి. మారియుపోల్‌లో శరణార్థుల తరలింపు సజావుగా సాగుతున్నా.. ఆ నగరాన్ని రష్యా సేనలు చుట్టుముట్టాయి. రష్యాను కట్టడి చేసేందుకు ఈయూ, బ్రిటన్‌, ఇటలీ దేశాలు మరిన్ని ఆంక్షలను విధించాయి.


కీవ్‌లో యుద్ధ బీభత్సం

ఉక్రెయిన్‌ రాజధాని నగరం కీవ్‌లో మంగళవారం యుద్ధ బీభత్సం కనిపించింది. ఎక్కడికక్కడ విధ్వంసమే లక్ష్యంగా రష్యా సేనలు రాకెట్‌ లాంచర్లు, భారీ బాంబులతో విరుచుకుపడ్డాయి. ఓ 15 అంతస్తుల భవనంపై జరిపిన దాడిలో ఐదుగురు మృతిచెందారు. రష్యా దురాక్రమణ తర్వాత కీవ్‌ పౌరులు ప్రాణభయంతో ఇంతకాలం సబ్‌-వే రైల్వేస్టేషన్‌లో తలదాచుకున్నారు. మెట్రోస్టేషన్లలో ఆశ్రయం పొందారు. ఇప్పుడు రష్యా అలాంటి ప్రదేశాలను టార్గెట్‌గా చేసుకుంది. సబ్‌-వే రైల్వేస్టేషన్‌పై వ్యాక్యూమ్‌ బాంబు వేసింది. కీవ్‌ ఉత్తరభాగంలోని స్వాతోషిన్‌స్క్యీ జిల్లాలోనూ అర్ధరాత్రి నుంచే రష్యా వైమానిక దాడులు జరిగాయి. ఇర్పిన్‌, బుచా, హోస్టోమెల్‌లనూ ఇదే పరిస్థితి. సోమవారం నాటి కార్గో విమానాల తయారీ పరిశ్రమ ఆంటోనోవ్‌ ప్లాంట్‌పై దాడిలో మరో ఇద్దరు మరణించినట్లు అధికారులు ప్రకటించారు. కీవ్‌ వర్సిటీ, ఓపెన్‌మార్కెట్‌లపై రష్యా పదాతిదళాలు జరిపిన షెల్లింగ్స్‌లో 10 మంది మరణించినట్లు తెలిపారు. సోమవారం ఒబాలాన్స్కీ నగరంలో తొమ్మిదంతస్తుల భవనంపై జరిపిన దాడుల్లో మరో ఇద్దరు చనిపోయారని, మరణాల సంఖ్య నాలుగుకు పెరిగిందని వివరించారు. కీవ్‌ శివార్లలోని బ్రోవరీలో జరిపిన దాడుల్లో.. ఆ నగర కౌన్సిలర్‌ మృతిచెందాడని, కీవ్‌ చెక్‌పోస్టుపైన జరిపిన దాడిలో ఒకరు చనిపోయారన్నారు. కీవ్‌లో రష్యా దాడులను కవర్‌ చేస్తున్న ఫాక్స్‌న్యూస్‌ వీడియో జర్నలిస్టు పీరె జాక్రెజెవ్‌స్కీ మృతిచెందినట్లు ఆ వార్తా సంస్థ వెల్లడించింది. రెబెల్స్‌ ఆధీనంలో ఉన్న డోనెట్స్క్‌ నగరంపై రష్యా జరిపిన ష్లెలంగ్‌లో 20 మంది పౌరులు చనిపోయారని ప్రకటించారు. మైకొలైవ్‌, చెర్నిహీవ్‌, ఖెర్సోన్‌ నగరాల్లోనూ రష్యా దాడులు కొనసాగాయి.


ఖార్కివ్‌లో సోమవారం రాత్రి దాడులకు ధ్వంసమైన శిథిలాల కింద ఏడు మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు. జాపొరీజియా రీజియన్‌లోని పోలోహీలో జరిగిన బాంబింగ్‌లో 20 మంది పౌరులు, 12 మంది ఉక్రెయిన్‌ సైనికులు మృతిచెందారు. కాగా.. ‘మార్షల్‌ లా’ను వచ్చేనెల 24 వరకు పొడిగిస్తున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. ఇప్పటివరకు 13,500 మంది రష్యా సైనికులను అంతమొందించామని ఉక్రెయిన్‌ ప్రకటించింది. మరోవైపు, ఐరోపా సమాఖ్య సహా.. బ్రిటన్‌, ఇటలీ దేశాలు రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాయి. అటు రష్యా-ఉక్రెయిన్‌ మధ్య నాలుగో విడత చర్చలు మంగళవారం  కొనసాగినా.. సానుకూల ఫలితమేదీ రాలేదని తెలిసింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోమారు నాటో విషయంలో నిర్వేదాన్ని వెల్లడించారు. మంగళవారం ఆయన బ్రిటన్‌ నేతృత్వంలోని జాయింట్‌ ఎక్స్‌పెడిషనరీ ఫోర్స్‌ భేటీలో మాట్లాడారు. ‘‘ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశాం. మాకు తలుపులు తెరిచే ఉన్నాయనే ప్రకటనలను వింటూనే ఉన్నాం. కానీ, మేం ఎన్నటికీ నాటోలో చేరలేమని మా దేశ ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే అర్థం చేసుకున్నారు. ఇది నిజం’’ అని వ్యాఖ్యానించారు. కాగా ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాకు చైనా ఆర్థిక సహాయం చేయడం పట్ల అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రష్యాకు ఆర్థికంగాగానీ, సైనికపరంగాగానీ ఎలాంటి సాయం చేసినా తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది. 


బైడెన్‌పై రష్యా ఆంక్షలు.. కెనెడా ప్రధానిపై నిషేధం

తనను ఆంక్షల ఛట్రంలో ఉక్కిరిబిక్కిరి కాకుండా చేస్తున్న అమెరికాపై రష్యా స్వరం పెంచింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆ దేశ మాజీ మంత్రి హిల్లరీ క్షింటన్‌, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌, రక్షణ మంత్రి ఆస్టిన్‌, ఆర్మీ చీఫ్‌ మార్క్‌ మిల్లే, పలువురు ఉన్నతాధికారులు, మంత్రులపై నిషేధం విధించింది. ఈ ఏడాది చివరికల్లా అమెరికాకు 200 ఉత్పత్తుల ఎగుమతిపైనా క్రమంగా నిషేధం విధిస్తామని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికాకు గ్యాస్‌ సరఫరాను కూడా నిలిపివేస్తామని స్పష్టం చేసింది.

Read more