బందిపోట్లలా పాశ్చాత్య దేశాలు : రష్యా

ABN , First Publish Date - 2022-03-06T00:09:06+05:30 IST

పాశ్చాత్య దేశాలు బందిపోట్ల మాదిరిగా వ్యవహరిస్తున్నాయని

బందిపోట్లలా పాశ్చాత్య దేశాలు : రష్యా

మాస్కో : పాశ్చాత్య దేశాలు బందిపోట్ల మాదిరిగా వ్యవహరిస్తున్నాయని రష్యా మండిపడింది. అమెరికా, యూరోప్‌ల కన్నా ప్రపంచం చాలా విశాలమైనదని, రష్యా అంటే ఏకాకిగా మార్చబడటానికి వీలుకానంత పెద్దదని పేర్కొంది. రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ శనివారం విలేకర్ల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 


రష్యాకు వ్యతిరేకంగా ఆర్థిక బందిపోటుతనానికి పాశ్చాత్య దేశాలు పాల్పడుతున్నాయని ఆరోపించారు. దీని భావం రష్యా ఏకాకిగా మారిందని కాదన్నారు. ఈ ధోరణికి దీటుగా స్పందిస్తామని చెప్పారు. ఈ స్పందన రష్యా ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. . ఓ దేశాన్ని యూరోపు, అమెరికా ఏకాకిగా చేయడానికి ప్రయత్నిస్తున్నాయని, ఆ దేశాల కన్నా ప్రపంచం చాలా విశాలమైనదని చెప్పారు. రష్యా వంటి పెద్ద దేశాన్ని ఏకాకిగా మార్చడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. దేశంలో చాలా దేశాలు ఉన్నాయన్నారు. రష్యా ఇంధన ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధిస్తే, ఇంధన మార్కెట్లపై చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభావం పడుతుందన్నారు. 


రష్యా సైన్యం గురించి బూటకపు వార్తలు ప్రచురిస్తే 15 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం కల్పించే చట్టాన్ని ఇటీవల రష్యా తీసుకొచ్చింది. దీంతో బీబీసీ, బ్లూమ్‌బర్గ్, ఇతర విదేశీ మీడియాపై కఠినంగా వ్యవహరించేందుకు అవకాశం లభించింది. ఫేస్‌బుక్‌తోపాటు కొన్ని వెబ్‌సైట్లను శుక్రవారం బ్లాక్ చేసింది. ఈ కొత్త చట్టాన్ని దిమిత్రి పెస్కోవ్ సమర్థించుకున్నారు. తమ దేశం సమాచార యుద్ధాన్ని ఎదుర్కొంటోందన్నారు. 


Read more