రష్యాపై ఆంక్షల వేటు

ABN , First Publish Date - 2022-02-24T07:48:49+05:30 IST

ఉక్రెయిన్‌పై దూకుడు పెంచిన రష్యా మీద.. అమెరికా, యూరప్‌ దేశాలు ఆంక్షల పదును పెంచుతున్నాయి. ముఖ్యంగా....

రష్యాపై  ఆంక్షల వేటు

ఆస్ట్రేలియా, జపాన్‌, కెనడా, బ్రిటన్‌, ఈయూ దేశాలు

రెండు అతిపెద్ద రష్యన్‌ బ్యాంకులపైన, ఆ దేశ సంపన్నుల పైన అమెరికా ఆంక్షలు

బాల్టిక్‌ దేశాలకు మరిన్ని దళాలు.. అమెరికా ఆంక్షలపై చైనా మండిపాటు

అంతర్జాతీయ చట్టాలను పుతిన్‌ ఉల్లంఘించారన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌

రిజర్వు బలగాల వాడకానికి సిద్ధమైన ఉక్రెయిన్‌.. దేశంలో నెల రోజులు ఎమర్జెన్సీ

రష్యాపై ఆంక్షల అమల్లో భారతీయ అమెరికన్‌  దలీప్‌ సింగ్‌ కీలక పాత్ర


మాస్కో, ఫిబ్రవరి 23: ఉక్రెయిన్‌పై దూకుడు పెంచిన రష్యా మీద.. అమెరికా, యూరప్‌ దేశాలు ఆంక్షల పదును పెంచుతున్నాయి. ముఖ్యంగా.. పాశ్చాత్యదేశాలతో రష్యా వ్యాపారసామర్థ్యాన్ని దెబ్బతీసే విధంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ కీలక ఆంక్షలను ప్రకటించారు. తొలి విడత చర్యల్లో భాగంగా.. రష్యాకు చెందిన రెండు అతి పెద్ద బ్యాంకులపై (వీఈబీ, ప్రోమ్‌స్వాజ్‌ బ్యాంకులు), రష్యన్‌ సావరిన్‌ డెట్‌పైన, ఆ దేశానికి చెందిన ఉన్నతవర్గాలవారిపైన, వారి కుటుంబసభ్యులపైన ఆంక్షలు ప్రకటించారు. అంతేకాదు మరిన్ని బలగాలను, ఆయుధాలను తరలిస్తున్నట్టు బైడెన్‌వెల్లడించారు. అయితే, ఈ సేనల తరలింపు.. తమ మిత్రులైన బాల్టిక్‌(ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా) దేశాలను బలోపేతం చేయడానికే తప్ప రష్యాపై పోరాడడానికి కాదని ఆయన స్పష్టం చేశారు.


ఉక్రెయిన్‌లోని లూహాన్స్క్‌, డోనెట్స్క్‌లను స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రాంతాలుగా రష్యా గుర్తించడం, అక్కడికి సేనలను నడిపించాలన్న పుతిన్‌ నిర్ణయం.. అంతర్జాతీయ చట్టాలను ఘోరంగా ఉల్లంఘించడమేనని బైడెన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు దేశానికి చెందిన భూభాగంలో రెండు ప్రాంతాలను కొత్త దేశాలుగా ప్రకటించే హక్కు పుతిన్‌కు ఎవరిచ్చారని గట్టిగా నిలదీశారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు ఇది ఆరంభం మాత్రమేనన్న బైడెన్‌.. ఉక్రెయిన్‌ నుంచి మరింత భూభాగాన్ని బలవంతంగా ఆక్రమించుకోవడానికి పుతిన్‌ రంగం సిద్ధం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రష్యా తన దూకుడును పెంచే కొద్దీ ఆంక్షల పదును కూడా పెంచుతామని ఆయన హెచ్చరించారు. ‘‘నన్ను ఒక విషయం స్పష్టం చేయనివ్వండి. ఇవన్నీ మావైపు నుంచి చేపట్టిన రక్షణాత్మక చర్యలు. రష్యాతో పోరాడే ఉద్దేశం మాకు ఎంతమాత్రం లేదు. యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి నాటో భూభాగంలో ప్రతి అంగుళాన్నీ కాపాడుతామని, నాటోకు మేమిచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉంటామనే సందేశాన్ని సందిగ్ధాలకు తావు లేకుండా పంపదలుచుకున్నాను’’ అని ఆయన స్పష్టం చేశారు.


మరోవైపు.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ను జెనీవాలో ఈ వారం కలవాలన్న ప్రణాళికను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ రద్దు చేసుకున్నారు. ఇక.. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నామని యూకే ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగినా, తూర్పు యూర్‌పలోని రష్యా సేనలను ఉపసంహరించుకోకపోయినా.. రష్యాకు చెందిన మరిన్ని బ్యాంకులు, సంపన్నులు, కీలక కంపెనీలపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. అమెరికా, యూరప్‌ దేశాలతో సమన్వయం చేసుకుంటూ ఆంక్షలు విధిస్తామని.. తద్వారా తామంతా ఒక్కటేననే సందేశాన్ని రష్యాకు పంపుతామని యూకే పేర్కొంది. ఇక.. యూరప్‌ దేశాలకు నేరుగా సహజవాయు సరఫరా నిమిత్తం చేపట్టి నార్డ్‌ స్ట్రీమ్‌ 2 గ్యాస్‌ పైప్‌లైన్‌కు అనుమతులను నిలిపివేయాలనే నిర్ణయాన్ని జర్మనీ చాన్స్‌లర్‌ ఓలాఫ్‌ స్కోల్జ్‌ ప్రకటించారు. యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన 27 దేశాలు కూడా రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. రష్యాతోపాటు.. ఉక్రెయిన్‌లో రష్యా గుర్తించిన రెండు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిడా పలు ఆంక్షలు ప్రకటించారు.


జపాన్‌లో రష్యా బాండ్లను కొత్తగా జారీ, పంపిణీ చేయడాన్ని నిషేధిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అంతేకాదు.. ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్‌, డోనెట్స్క్‌ ప్రాంతాలకు చెందినవారికి వీసాల జారీని కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అటు కెనడా కూడా రష్యాపై ఆంక్షలు విధించడమే కాక.. నాటో దళాలకు మద్దతుగా లాత్వియాకు 460 మంది సైనికులను పంపడానికి సిద్ధమైంది. రష్యాను ఆర్థికంగా ఒంటరిని చేసేందుకు పలు చర్యలు చేపడుతున్నట్టు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తెలిపారు. మరోవైపు.. 2014 నుంచి రష్యాపై ఆంక్షలను కొనసాగిస్తున్న ఆస్ట్రేలియా తాజాగా మరిన్ని ఆర్థిక ఆంక్షలు, ప్రయాణ నిషేధాలు విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఆంక్షలకు వ్యతిరేకంగా రష్యా చేసే సైబర్‌ దాడులను తిప్పికొట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. 


పుతిన్‌ మూడు విజ్ఞప్తులు..

క్రిమియాను రష్యాలో భాగంగా గుర్తించాలని, ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇచ్చే ఆలోచన విరమించుకోవాలని, ఆ ప్రాంతానికి ఆయుధాల తరలింపును నిలిపివేయాలని అంతర్జాతీయ సమాజానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ విజ్ఞప్తి చేశారు. ఇక, తాజా పరిణామాల నేపథ్యంలో రష్యా విదేశాంగ శాఖ.. ఉక్రెయిన్‌లోని తమ రాయబార కార్యాలయ సిబ్బందిని అక్కడి నుంచి ఖాళీ చేయించి వెనక్కి తీసుకువచ్చేస్తోంది. అటు ఉక్రెయిన్‌ కూడా రష్యాలో ఉన్న తమ దేశ ప్రజలు వెనక్కి వచ్చేయాలని పిలుపునిచ్చింది. 


రిజర్వు దళాలకు పిలుపు

రష్యాతో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని డోనెట్స్క్‌, లుహాన్స్క్‌ ప్రాంతాలు మినహా మిగతా అన్నిచోట్ల 30 రోజుల పాటు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అవసరమైతే ఎమర్జెన్సీని మరో 30 రోజులు పొడిగిస్తామని ఉ క్రెయిన్‌ భద్రతా మండలి వెల్లడించింది. దేశంలోని అనేక ప్రాం తాల్లో కర్ఫ్యూను కొనసాగిస్తామని తెలిపింది. అలాగే.. రష్యా దళాలు దేశాన్ని చుట్టుముట్టిన నేపథ్యంలో దేశ రిజర్వుడు సాయుధ దళాల్లో కొంతమందిని రంగంలోకి దింపడానికి సిద్ధమైనట్టు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమీర్‌ జెలెన్‌స్కీ ప్రకటించారు. మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటన మేరకు ఆ దేశం నాటోకు మద్దతుగా 800 పదాతి దళాలను, 40 యుద్ధవిమానాలను బాల్టిక్‌ దేశాలకు పంపనున్నట్టు భోగట్టా. 


పౌరులు ఆయుధాలు ధరించొచ్చు: ఉక్రెయిన్‌

ఆత్మరక్షణ కోసం తమ పౌరులు ఆయుధాలు తీసుకెళ్లేందుకు ఉక్రెయిన్‌ పార్లమెంటు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రూపొందించిన ముసాయిదా చట్టానికి పార్లమెంటు బుధవారం ఆమోదం తెలిపింది. దేశం, సమాజ ప్రయోజనాల నిమిత్తం ఈ చట్టాన్ని రూపొందించి, ఆమోదించామని పార్లమెంటు అధికారులు ఓ ప్రకటనలో చెప్పారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ చట్టాన్ని రూపొందించాల్సి వచ్చిందని తెలిపారు. పార్లమెంటు ఆమోదం నేపథ్యంలో పౌరులు అప్పుడే ఆయుధాల దుకాణాలకు వెళ్లి ఆయుధాలు కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఉక్రెయిన్‌ ప్రభుత్వ, బ్యాంకు వెబ్‌సైట్లు సైబర్‌ దాడులకు గురయ్యాయి. దీంతో పలు సైట్ల హోం పేజీలు బుధవారం తెరుచుకోలేదు. సర్వర్లు స్తంభించి ఆ సైట్లు తెరుచుకోలేదు.


ఉక్రెయిన్‌లో భయోత్పాతం..

రష్యా మీద అమెరికా ఆంక్షలు విధించడం పట్ల చైనా తీవ్రంగా మండిపడింది. ఆ ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. ఉక్రెయిన్‌లో పౌరులకు ఆయుధాలు సమకూర్చడం ద్వారా అమెరికా భయానక వాతావరణం సృష్టిస్తోందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్‌యింగ్‌ ధ్వజమెత్తారు. ఉక్రెయిన్‌ విషయంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను చల్లార్చేందుకు అంతర్జాతీయ సమాజం చర్చలు జరపాలని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు.. తాజా పరిణామాల నేపథ్యంలో పోప్‌ ఫ్రాన్సిస్‌ స్పందించారు. రష్యా, ఉక్రెయిన్‌ సమన్వయం పాటించాలని, ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు తనను తీవ్రంగా బాధిస్తున్నాయని తెలిపారు.

Read more