RSS: ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి నిరాకరణ

ABN , First Publish Date - 2022-09-30T14:49:47+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబరు రెండో తేదీ అన్ని జిల్లా కేంద్రాల్లో ఆర్‌ఎస్ఎస్‌(RSS) నిర్వహించతలపెట్టిన ర్యాలీలకు పోలీస్ శాఖ అనుమతి

RSS: ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి నిరాకరణ

- వీసీకే మానవహారానికి రెడ్‌ సిగ్నల్‌

- శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం


చెన్నై, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబరు రెండో తేదీ అన్ని జిల్లా కేంద్రాల్లో ఆర్‌ఎస్ఎస్‌(RSS) నిర్వహించతలపెట్టిన ర్యాలీలకు పోలీస్ శాఖ అనుమతి నిరాకరించింది. శాంతిభద్రతలకు విఘాగం కలిగే అవకాశముందనే అనుమానంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆర్‌ఎస్ఎస్‌తో పాటు అదేరోజు ర్యాలీలకు సిద్ధమైన వీసీకే తదితర పార్టీలకు కూడా అనుమతి లేదని స్పష్టం చేసింది. అదే రోజు ర్యాలీలకు సిద్ధమైన పార్టీలకు, సంస్థలకు ఎలాంటి అనుమతివ్వడం లేదని వెల్లడించింది. అన్ని జిల్లా ప్రధాన కేంద్రాల్లో అక్టోబరు 2న ఆర్‌ఎస్ఎస్‌ ర్యాలీలు నిర్వహించతలపెట్టింది. ఇందుకోసం చెన్నై, తిరువళ్ళూరు, కాంచీపురం, చెంగల్పట్టు సహా అన్ని జిల్లాల ఎస్పీ కార్యాలయాల్లో అనుమతి కోరుతూ నిర్వాహకులు వినతి పత్రాలు సమర్పించారు. మరోవైపు ఆర్‌ఎస్ఎస్‌కు చెందిన 9 మంది ప్రతినిధులు మద్రాస్‌ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇందులో.. ‘వచ్చే నెల 2న అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించతలపెట్టిన శాంతియుత ఊరేగింపునకు పోలీసు శాఖ అనుమతిచ్చేలా ఆదేశించాలని కోరారు. దీనిపై ఈ నెల 22న విచారణ జరిపిన హైకోర్టు.. ఆర్‌ఎ్‌సఎస్‌ వినతిపై సానుకూలంగా స్పందించాలని, ఈ నెల 28లోగా షరతులతో కూడిన అనుమతిచ్చేలా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీంతో ఆర్‌ఎస్ఎస్‌ వచ్చే నెల రెండో తేదీన ఊరేగింపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. అయితే, ఆర్‌ఎస్ఎస్‌ ఊరేగింపుపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. వారికి అనుమతివ్వరాదంటూ వీసీకే ప్రధాన కార్యదర్శి, ఎంపీ తోల్‌ తిరుమావళవన్‌ హైకోర్టును ఆశ్రయించారు. అయితే తన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలంటూ ఆయన చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో అక్టోబరు 2న తాము కూడా రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా మానవహారాన్ని నిర్వహించనున్నట్టు వీసీకే అధినేత తిరుమావళవన్‌ ప్రకటించారు. దీంతో ఒకేరోజు రెండు వర్గాల ర్యాలీలు జరిగితే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ అనుమానిస్తున్నాయి. దీంతో ఆర్‌ఎస్ఎస్‌(RSS) చేపట్టే ఊరేగింపులకు అనుమతివ్వరాదంటూ ఎస్పీ కార్యాలయాలకు ఆదేశాలు వెళ్లాయి. ఈ విషయంపై పోలీసు శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ... రాష్ట్రంలో వరుస పెట్రోల్‌ బాంబు దాడుల తర్వాత ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొంటోందని, ఈ నేపథ్యంలో అక్టోబరు 2న అన్ని జిల్లాల్లో ఆర్‌ఎస్ఎస్‌ ఊరేగింపు నిర్వహించేందుకు అనుమతి కోరడం సబబు కాదన్నారు. అదే రోజున మరికొన్ని సంస్థలు మానవహారాలు, ఊరేగింపులకు అనుమతి కోరుతూ వినతి పత్రాలు సమర్పించాయని, రెండు వర్గాలు ఒకే రోజు ఊరేగింపు, మానవహారాలు నిర్వహిస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఆర్‌ఎస్ఎస్‌ ఊరేగింపునకు అనుమతి నిరాకరించినట్టు వివరించారు. 


నేడు కోర్టు ధిక్కరణపై విచారణ? 

ఆర్‌ఎస్ఎస్‌ తలపెట్టిన ఊరేగింపునకు షరతులతో కూడిన అనుమతి చ్చేందుకు ఈ నెల 28లోగా నిర్ణయం తీసుకోవాలని ఈ నెల 22న హైకోర్టు పోలీసుశాఖను ఆదేశించింది. అయితే, పోలీసు శాఖ శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటూ అనుమతివ్వలేదు. దీంతో ఆర్‌ఎస్ఎస్‌ నిర్వాహకులు మళ్ళీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఇళంద్రియన్‌ సమక్షంలో గురువారం విచారణకు రాగా ఆర్‌ఎస్ఎస్‌ తరపున హాజరైన న్యాయవాదులు ఈ నెల 22న ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను ప్రధానంగా ప్రస్తావించడమే కాకుండా, కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేసేందుకు అనుమతివ్వాలని కోరారు. ఇతర పార్టీలు జరుపతలపెట్టిన ఊరేగింపులు, మానవహారాలను సాకుగా చూపించి తమకు అనుమతి నిరాకరించారన్నారు. దీనిపై కల్పించుకున్న న్యాయమూర్తి కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేయొచ్చని, దీనిపై వీలును బట్టి శుక్రవారం విచారణ చేపడతామన్నారు. 


నేడు పోలీస్‌ శాఖ పిటిషన్‌పై విచారణ

ఆర్‌ఎస్ఎస్‌ నిర్వహించతలపెట్టిన ఊరేగింపునకు షరతులతో కూడిన అనుమతివ్వాలంటూ ఈ నెల 22న ఇచ్చిన ఉత్తర్వులపై పునఃపరిశీలన చేయాలని కోరుతూ పోలీస్‌ శాఖ తరపున దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్‌ హైకోర్టులో శుక్రవారం విచారణ జరుగనుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని, అందువల్ల ఆర్‌ఎస్ఎస్‌(RSS) ఊరేగింపునకు అనుమతివ్వాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించాని పోలీస్‌ శాఖ పేర్కొంది. 

Updated Date - 2022-09-30T14:49:47+05:30 IST