Coal smuggling case: అభిషేక్ బెనర్జీ బంధువును విమానాశ్రయంలో అడ్డుకున్న ఈడీ

ABN , First Publish Date - 2022-09-11T22:25:09+05:30 IST

బొగ్గు స్మగ్లింగ్ కుంభకోణానికి సంబంధించిన అక్రమ లావాదేవీల కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ...

Coal smuggling case: అభిషేక్ బెనర్జీ బంధువును విమానాశ్రయంలో అడ్డుకున్న ఈడీ

న్యూఢిల్లీ: బొగ్గు స్మగ్లింగ్ కుంభకోణానికి (Coal smuggling case) సంబంధించిన అక్రమ లావాదేవీల కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ సమీప బంధువైన మనేకా గంభీర్‌ (Maneka Gambhir)కు చుక్కెదురైంది. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బ్యాంకాక్ వెళ్లేందుకు మనేకా గంభీర్ కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకోగా ఆమెకు ఇమిగ్రేషన్ క్లియరెన్స్ లభించలేదు. ఈడీ గతంలోనే ఆమెకు లుకవుట్ నోటీసు జారీ చేశారు. ఆ విషయాన్ని విమానాశ్రయ అధికారులు ఈడీకి చేరవేయడంతో అధికారులు అక్కడకు చేరుకున్నారు. సోమవారం విచారణకు హాజరుకావాలంటూ ఆమెకు సమన్లు అందజేశారు. దాంతో ఆమె వెనుదిరిగి వెళ్లిపోయారు.


కాగా, ఈ  కేసులో మనేకా గంభీర్‌ను సీబీఐ గతంలో ప్రశ్నించినప్పటికీ ఈడీ మాత్రం ఇంతవరకూ విచారించలేదు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి సెప్టెంబర్ 5న రావాలని ఈడీ అధికారులు గతంలో సమన్లు జారీ చేసినప్పటికీ ఆ ఆదేశాలను ఆమె కోర్టుకో సవాలు చేశారు. కోల్‌కతాలోని ఈడీ కార్యాలయంలో విచారణ జరిపేలా ఆదేశించాలని ఆమె కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు సోమవారంనాడు కోల్‌కతాలోని ఈడీ కార్యాలయంలో ఆమెను విచారించనున్నారు. అభిషేక్ బెనర్జీ విషయంలోనూ ఇదే జరిగింది. ఢీల్లీలోని ఈడీ కార్యాలయం ఆయనకు గతంలో సమన్లు పంపగా, తనను కోల్‌కతాలో ప్రశ్నించేందుకు ఈడీని ఆదేశించాలంటూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో ఈడీ కోల్‌కతా కార్యాలయంలో సెప్టెంబర్ 2న ఆయనను 7 గంటల సేపు ఈడీ ప్రశ్నించింది.


మమత మండిపాటు

కాగా, రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు సెంట్రల్ ఏజెన్సీలను బీజేపీ సారథ్యంలోని కేంద్రం ఉసిగొల్పుతోందంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. బొగ్గు గనుల వద్ద భద్రత అనేది కేంద్ర సంస్థల బాధ్యతని, దొంగతనం కానీ, స్మగ్లింగ్ ప్రయత్నం కానీ జరక్కుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర హోం మంత్రి అమిత్‌షాదేనని ఆమె అన్నారు.

Updated Date - 2022-09-11T22:25:09+05:30 IST