Bharat Jodo Yatra: గెహ్లాట్, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల హోరులో రాహుల్‌ పాదయాత్ర కొట్టుకుపోయిందా?

ABN , First Publish Date - 2022-09-30T23:32:12+05:30 IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల హోరులో రాహుల్‌ భారత్ జోడో కొట్టుకుపోయిందా? అశోక్ గెహ్లాట్, రాజస్థాన్ రాజకీయం రాహుల్ స్పేస్‌ను కాజేసిందా?

Bharat Jodo Yatra: గెహ్లాట్, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల హోరులో రాహుల్‌ పాదయాత్ర కొట్టుకుపోయిందా?

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల హోరులో రాహుల్‌ భారత్ జోడో కొట్టుకుపోయిందా? అశోక్ గెహ్లాట్, రాజస్థాన్ రాజకీయం రాహుల్ స్పేస్‌ను కాజేసిందా? ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్, డిజిటల్ మీడియా అంతా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల అభ్యర్ధులు, అశోక్ గెహ్లాట్ రాజస్ధాన్ రాజకీయాలు కవర్ చేయడంలో, రాయడంలో మునిగిపోయాయి. దీంతో రాహుల్ గాంధీ సెప్టెంబర్ ఏడున తలపెట్టిన భారత్ జోడో యాత్రను పెద్దగా పట్టించుకోలేదు. ఆరంభంలో రాహుల్ టీ షర్ట్ ధరించారని బీజేపీ ఆరోపించినప్పుడు అలాగే మరో 145 రోజులు మాత్రమే మిగిలి ఉందని చెబుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిక్కరును కాల్చి వేస్తున్న ఫొటో విడుదల చేసినప్పుడు మాత్రమే భారత్ జోడో వార్తలు మీడియాలో కనిపించాయి. ఆ తర్వాత మీడియా మొత్తం కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్ధుల కథనాలు రాయడం ప్రారంభించాయి. 


అన్నింటినీ మించి రాజస్థాన్‌లో రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఎంతలా అంటే కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్ధి రేసులో ముందున్నారని టాక్ వచ్చిన అశోక్ గెహ్లాట్ తన సీఎం పదవి ఉండాలా లేక ఊడిపోవాలా అనేది సోనియా గాంధీ నిర్ణయించాలని చెప్పేదాకా వచ్చింది. తాను కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలిచాక కూడా రాజస్థాన్ సీఎంగా కొనసాగుతానని తొలుత ప్రతిపాదించారు. స్వయంగా సోనియా, రాహుల్‌ను కలిసి తన మనసులో మాట బయటపెట్టారు. అయితే ఒక వ్యక్తి ఒకే పదవి అనే నిబంధన ప్రకారం కుదరదని సోనియా, రాహుల్ తేల్చి చెప్పారు. ఆ తర్వాత అశోక్ గెహ్లాట్ రూటు మార్చారు. తాను సీఎంగా లేకున్నా తన మద్దతుదారుల్లో ఒకరిని సీఎం చేయాలని కోరారు. తన ప్రత్యర్థి సచిన్ పైలట్ మాత్రం ముఖ్యమంత్రి కావడానికి వీల్లేదని అడ్డుకునేందుకు యత్నించారు. చివరకు అశోక్ గెహ్లాట్ మద్దతుదారులైన 93 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ సీపీ జోషీకి రాజీనామాలు కూడా సమర్పించారు. దీంతో మీడియా దృష్టి అంతా రాజస్థాన్ వైపు మళ్లింది. స్వయంగా అధిష్టానం రంగంలోకి దిగి అజయ్ మాకెన్‌ను, మల్లికార్జున ఖర్గేను జైపూర్ పంపినా అశోక్ గెహ్లాట్ వర్గీయులు శాంతించలేదు. కనీసం వారితో సమావేశమయ్యేందుకు కూడా ముందుకు రాలేదు. ఇది అధిష్టానానికి అవమానంగా అనిపించింది. ఈ పరిస్థితుల్లో తాను కూడా ఏం చేయలేనంటూ గెహ్లాట్ చేతులెత్తేశారు. అజయ్ మాకెన్‌ను, మల్లికార్జున ఖర్గే జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్లిపోవడం, గెహ్లాట్‌ను, సచిన్‌పైలట్‌ను ఢిల్లీకి పిలుచుకోవడం జరిగిపోయాయి. ఆ తర్వాత సోనియా గెహ్లాట్‌పై విరుచుకుపడి కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి రేసు నుంచి తప్పుకోవాలని కోరారు. రాజస్థాన్ అసమ్మతిని అదుపుచేయలేని నాయకుడు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఎలా చక్కదిద్దగలరని సోనియా గెహ్లాట్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. సీఎం సీటు నుంచి గెహ్లాట్‌ను తప్పిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. సచిన్ పైలట్‌ను సీఎం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం దాదాపు నిర్ణయించినట్లు సమాచారం. గెహ్లాట్ రెంటికీ చెడ్డ రేవడయ్యారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి దాదాపు ఖాయమైన స్థితిలో పోగొట్టుకున్నారు. ఇక సీఎం కుర్చీ కూడా ఉంటుందా ఊడుతుందా అనేది త్వరలోనే తేలనుంది. 


ఇక రాహుల్ సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి భారత్ జోడో పాద యాత్ర ప్రారంభించారు. తర్వాత కేరళలో యాత్ర ముగించుకుని ఇవాళే కర్ణాటక చేరుకున్నారు. 

రాహుల్ భారత్ జోడో యాత్ర మూడు వారాలుగా కొనసాగుతున్నా మీడియా ప్రధాన శీర్షికల్లో ఉండలేకపోతోంది. కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతికి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి మాత్రమే మీడియాలో చోటు లభిస్తోంది. నిజానికి అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయినా మీడియా దృష్టి మొత్తం కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల వైపే ఉంది తప్ప రాహుల్ భారత్ జోడోయాత్రను పట్టించుకోవడం లేదు. తన పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనుకున్న రాహుల్ ప్రయత్నాలకు సొంత పార్టీలోని అసమ్మతి, ఇతర వ్యవహారాలే అడ్డుతగులుతున్నాయి. రాహుల్ యాత్ర మీడియాను ఆకట్టుకోలేకపోతోంది. 


కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్నదంతా సైడ్ షో అని, మెయిన్‌ షో అంతా కాంగ్రెస్ సీనియర్ నేత జై రాం రమేశ్ విలేకరుల సమావేశాలు పెట్టిమరీ చెప్పుకోవాల్సి వస్తోందంటే పరిస్థితికి అద్దం పడుతోందని పరిశీలకులంటున్నారు. 


కర్ణాటకలోకి ప్రవేశించిన రాహుల్ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమార్తె ప్రియాంకా వాద్రా కూడా పాల్గొంటారని తెలిసింది. 5 నెలల పాటు 3500 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గుండా రాహుల్ పాదయాత్ర సాగనుంది.   

Updated Date - 2022-09-30T23:32:12+05:30 IST

Read more