Rahul Gandhi: సిమ్లాకంటే గూడలూరే రమణీయం

ABN , First Publish Date - 2022-09-30T14:20:11+05:30 IST

సిమ్లా కంటే గూడలూరే ఎంతో అందంగా, రమణీయంగా వుందని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ(Former President of AICC Rahul Gan

Rahul Gandhi: సిమ్లాకంటే గూడలూరే రమణీయం

- ‘భారత్‌ జోడో’ యాత్రలో రాహుల్‌

- గూడలూరులో కాంగ్రెస్‌ కార్యకర్తలు, ప్రజల ఘన స్వాగతం


అడయార్‌(చెన్నై), సెప్టెంబరు 29: సిమ్లా కంటే గూడలూరే ఎంతో అందంగా, రమణీయంగా వుందని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ(Former President of AICC Rahul Gandhi) పేర్కొన్నారు. ‘భారత్‌ జోడో’ యాత్ర 19వ రోజైన గురువారం సాయంత్రం సరిహద్దు ప్రాంతమైన నీలగిరి జిల్లా గూడలూరు చేరుకున్న రాహుల్‌గాంధీకి టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి(KS Alagiri), మాజీ అధ్యక్షులు తంగబాలు, తిరునావుక్కరసర్‌, కాంగ్రెస్‌ శ్రేణులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్‌ మాట్లాడుతూ.. ‘‘మా అక్క సిమ్లాలో ఒక ఇంటిని కొనుగోలు చేశారని, అది ఎంతో అందంగా ఉందని పదేపదే చెబుతుంటుంది. కానీ, నాకు ఆ ప్రాంతం కంటే గూడలూరే ఎంతో అందంగా ఉంది. ఈ ప్రాంతంలో మూడు విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నిశిస్తున్నారన్నారు. తమిళం, మలయాళం, కన్నడ ప్రజలు కలిసి మెలిసి జీవిస్తున్నారు. ఈ గూడలూరు ఎత్తైన కొండలు, రమణీయమైన ప్రకృతి సౌందర్యాల నడుమ సిమ్లా కంటే  అందంగా వుంది. నేను చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’కు నిజమైన అర్థాన్నిచ్చేలా ఈ ప్రాంతం వుంది’’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కలిసిమెలిసి జీవించడమెలా? ఐక్యంగా ఎలా ఉండాలన్న విషయాన్ని చెప్పడానికి తాను ఇక్కడకు రాలేదని, కానీ, ఈ ప్రాంత ప్రజలు కలిసిమెలిసి ఉన్నట్టుగా మిగిలిన ప్రాంతాల ప్రజలు కూడా ఐక్యంగా జీవించాలని తెలియజెప్పేందుకే వచ్చానని వ్యాఖ్యానించారు. ‘‘పాదయాత్రలో ఒక నదీ ప్రవాహాన్ని గుర్తించాను. అదే ప్రజా ప్రవాహం. కొండ ఎత్తుపల్లాలపై సాగుతూ వచ్చింది. 

    ఆ ప్రవాహంలో వేర్వేరు భాషలు, వేర్వేరు సంస్కృతులకు చెందినవారున్నారు. కానీ వారిలో ఏ ఒక్కరిలోనూ ద్వేషం, ఏహ్యభావం మచ్చుకైనా కనిపించలేదు. ఇక్కడ నివశించే వారు ప్రత్యేకించి ఒక్క భాష మాత్రమే మాట్లాడాలని ఎవ్వరూ కోరడం లేదు. తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్‌, హిందీ.. ఇలా అన్ని భాషల వారున్నారు. ఏదో ఒక భాషను మాత్రమే మాట్లాడాలని ఎవ్వరూ ఒత్తిడి చేయడం లేదు. నా ఆశయం కూడా అదే. అదే భారతదేశం’’ అంటూ రాహుల్‌గాంధీ అక్కడి స్థానికులను అభినందించారు. ఇదిలా వుండగా శుక్రవారం రాహుల్‌గాంధీ పాదయాత్ర కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించనుంది.

Updated Date - 2022-09-30T14:20:11+05:30 IST