Punjab : సిద్ధూ మూసే వాలా కుటుంబ సభ్యులకు రాహుల్ గాంధీ పరామర్శ

ABN , First Publish Date - 2022-06-07T20:12:27+05:30 IST

ఇటీవల దారుణ హత్యకు గురైన పంజాబీ గాయకుడు సిద్ధూ మూసే వాలా (

Punjab : సిద్ధూ మూసే వాలా కుటుంబ సభ్యులకు రాహుల్ గాంధీ పరామర్శ

చండీగఢ్ : ఇటీవల దారుణ హత్యకు గురైన పంజాబీ గాయకుడు సిద్ధూ మూసే వాలా (Sidhu Moose Wala) కుటుంబ సభ్యులను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మంగళవారం పరామర్శించారు. ఆయనతోపాటు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వర్రింగ్, ఆ రాష్ట్ర శాసన సభలో ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా, మాజీ ఉప ముఖ్యమంత్రి ఓపీ సోనీ, ఇతర కాంగ్రెస్ నేతలు ఉన్నారు.


రాహుల్ గాంధీ చండీగఢ్ విమానాశ్రయం నుంచి నేరుగా మాన్సా జిల్లా, మూసా గ్రామానికి వెళ్ళి, సిద్ధూ కుటుంబీకులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన పర్యటన సందర్భంగా సిద్ధూ నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సిద్ధూ మూసే వాలాపై మే 29న గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి, ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నారు. 


సిద్ధూ మూసే వాలా (Sidhu Moose Wala) గత ఏడాది డిసెంబరులో కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో మాన్సా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, పరాజయం పాలయ్యారు. 


సిద్ధూ తల్లిదండ్రులు శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)ను కలిశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అంతకుముందు సిద్ధూ హత్య పట్ల తీవ్ర సంతాపం ప్రకటించారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐ (Central Bureau of investigation)కు లేదా జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ముఖ్యమంత్రిని కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బాజ్వా కోరారు. 


Read more