Rahul Gandhi: ఆంగ్లేయుల బాటలోనే మోదీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-09-08T14:18:43+05:30 IST

మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఆంగ్లేయుల పాలనను స్ఫూర్తిగా తీసుకుందని, అందుకే దేశవిముక్తి కోసం తాను పాదయాత్ర చేస్తు

Rahul Gandhi: ఆంగ్లేయుల బాటలోనే మోదీ ప్రభుత్వం

- అందుకే దేశవిముక్తి కోసం పాదయాత్ర

- ‘భారత్‌ జోడో’ యాత్రలో రాహుల్‌

- కన్నియాకుమారిలో ప్రారంభం

- ఆప్యాయాలింగనంతో స్టాలిన్‌కు ప్రశంసలు

- కేంద్రంపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్‌ సీనియర్లు


చెన్నై, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఆంగ్లేయుల పాలనను స్ఫూర్తిగా తీసుకుందని, అందుకే దేశవిముక్తి కోసం తాను పాదయాత్ర చేస్తున్నట్టు కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ(Former Congress president Rahul Gandhi) ప్రకటించారు. ప్రజల కష్టాలను పక్కకునెట్టి కొన్ని కార్పొరేట్‌ సంస్థల అభివృద్ధే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందని, ఇది ఎంతవరకు సమంజసమో ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బుధవారం ఉదయం శ్రీపెరంబుదూర్‌లోని రాజీవ్‌ స్మారకస్థలిలో నివాళులర్పించిన రాహుల్‌గాంధీ.. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో తిరువనంతపురానికి అక్కడి నుంచి సాయంత్రం ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో కన్నియాకుమారి(Kanniyakumari) చేరుకుని తిరువళ్లువర్‌ విగ్రహాన్ని, వివేకానంద, కామరాజర్‌ స్మారక మండపాలను, గాంధీమండపాన్ని సందర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ దగ్గరుండి గాంధీమండపాన్ని చూపించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనల అనంతరం, అదే ప్రాంగణంలో రాహుల్‌కు జాతీయ పతాకాన్ని అందించిన తమిళనాడు, రాజస్థాన్‌, ఛత్తీస్‏ఘడ్‌(Rajasthan, Chhattisgarh) ముఖ్యమంత్రులు స్టాలిన్‌, అశోక్‌ గహ్లోత్‌, భూపేశ్‌ భఘేల్‌ పాదయాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాహుల్‌ జాతీయ పతాకానికి సెల్యూట్‌ చేశారు. అనంతరం స్టాలిన్‌ రాహుల్‌కు శాలువా కప్పి సత్కరించగా, రాహుల్‌ ఆయన్ని ఆలింగనం చేసుకుని అభినందించారు. అక్కడి నుంచి 700 మీటర్ల దూరంలో ఉన్న ‘త్రివేణి సంగమం’ వద్ద ఏర్పాటైన బహిరంగ సభాస్థలికి రాహుల్‌ నడచుకుంటూ వెళ్లారు. భారీగా తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి రాహుల్‌ ప్రసంగిస్తూ... బీజేపీ అధికారంలోకి వచ్చాక పేదలు, రైతులు, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలు దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. పరిశ్రమలన్నీ నిర్వీర్యంగా మారాయని, అన్నదాతలు జీవించడానికే కష్టపడుతున్నారని అన్నారు. యువకులు ఉద్యోగాలు లేక, తగినంత సంపాదన లేక నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కన్నియాకుమారి త్రివేణి సంగమం సమీపంలో పాదయాత్రను ప్రారంభించడం తనకెంతో ఆనందంగా, గర్వంగాను ఉందన్నారు. ఈ పాదయాత్రను ప్రారంభించేందుకు విచ్చేసి, జాతీయ పతకాన్ని అందించిన తన సోదరుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. 


దుష్టశక్తుల నుంచి విముక్తి కోసమే: చిదంబరం

బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని తరిమికొట్టేందుకు జాతీయ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన స్వాతంత్య్ర సంగ్రామాన్ని తలపించేలా దేశాన్ని పట్టిపీడిస్తున్న బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ వంటి దుష్ట శక్తుల నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకే ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేపట్టారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం(Former Union Minister P. Chidambaram) పేర్కొన్నారు. త్రివేణి సంగమ ప్రాంతంలో నాలుగో సంద్రాన్ని తలపించేలా లక్షలాదిమంది కార్యకర్తలు గుమికూడటం ఆనందంగా ఉందన్నారు. ఈ పాదయాత్రను హేళన చేసేవారిని క్షమించాలంటూ గాంధీ, కామరాజర్‌లను వేడుకుంటున్నానన్నారు. క్విట్‌ ఇండియా నినాదంతో గాంధీ స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రారంభించారని, ఆంగ్లేయ పాలకులను తరిమకొట్టండంటూ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం అదే రీతిలో దేశ ప్రజలను విభజించి పాలిస్తూ కుల, మత ప్రాతిపదికన చిచ్చు రగిలిస్తున్న బీజేపీ పాలకులను తరిమికొట్టాలని పిలుపునిస్తూ రాహుల్‌ పాదయాత్ర చేపట్టారన్నారు. ఈ పాదయాత్రను విమర్శించేవారంతా స్వాత్రంత్య ఉద్యమంలో పాల్గొనలేదనే విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. చివరగా భారతియార్‌ కవితలోని కొన్ని పంక్తులను ఉటంకిస్తూ యువభారతమే కదలిరా విజయపతాకంతో కదలిరా అని ఆ మహాకవి పిలుపును ఆదర్శంగా తీసుకుని కాంగ్రెస్‌ నేత పాదయాత్రను చేపట్టిన రాహుల్‌కు పిలుపునిస్తున్నానని సభికుల హర్షధ్వానాల మధ్య పేర్కొన్నారు.


దుష్ట శక్తులను తరిమికొడదాం: మల్లికార్జున ఖర్గే

 75 యేళ్ల క్రితం నెహ్రూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పారని, ఆ నినాదంతోనే రాహుల్‌ పాదయాత్ర చేపడుతున్నాని కాంగ్రెస్‌ జాతీయ నాయకుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. సెక్యులరిజమే ప్రజలకు సామాజిక న్యాయం స్వేచ్ఛ కలిగిస్తుందని నెహ్రూ చెప్పారని, ప్రస్తుతం సెక్యూలరిజానికి ప్రమాదం ముంచుకొస్తుండటంతో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ప్రసంగిస్తూ.. మతతత్వ శక్తులపై పోరాడే దిశగా భారతీయులందరినీ సమైక్యపరచటమే భారత్‌ జోడోయాత్ర ప్రధాన లక్ష్యమన్నారు. దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్న పాలకులకు గుణపాఠం చెప్పేందుకే రాహుల్‌ పాదయాత్రను చేపట్టారని ఛత్తీస్‏ఘడ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ భఘేల్‌ చెప్పారు.


మరో దండియాత్ర : కేఎస్‌ అళగిరి

టీఎన్‌సీసీ అధ్యక్షుడు స్వాగతోపన్యాసం చేస్తూ పాదయాత్రలను నిర్వహించే బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని జాతీయ కాంగ్రెస్‌ అంతమొందించిందని గుర్తు చేశారు. రాహుల్‌ నిర్వహిస్తున్న భారత్‌ జోడో పాదయాత్ర(Bharat Jodo Padayatra) మరో దండియాత్రలా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకుంటుందన్నారు. కావాలనుకుంటే రాహుల్‌ పదేళ్ల క్రితమే ప్రధాని అయివుండేవారని, అయితే ఆ అవకాశాన్ని తిరస్కరించి అందరి ప్రశంసలందుకున్నారని కొనియాడారు. ఈ చారిత్రక పాదయాత్ర రాష్ట్రంలో నిర్వహించడం తమిళ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. ఈ సభకు కాంగ్రెప్‌ ఎంపీ జ్యోతిమణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇదిలా వుండగా ఈ పాదయాత్ర ప్రారంభోత్సవానికి స్టాలిన్‌, అశోక్‌ గహ్లోత్‌, భూపేశ్‌ భఘేల్‌తో పాటు కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ సీనియర్‌ నేతలు పి.చిదంబరం, శశిథరూర్‌, దిగ్విజయ్‌సింగ్‌, మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్‌, కేసీ వేణుగోపాల్‌, డీకే శివకుమార్‌, టి.సుబ్బిరామిరెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్‌ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్‌, డీఎంకే సీనియర్‌ నేత టీఆర్‌ బాలు, కేఎన్‌ నెహ్రూ తదితరులు కూడా పాల్గొన్నారు. అయితే బహిరంగసభకు డీఎంకే నేతలు  మాత్రం  హాజరు కాలేదు. 
Read more