National Herald Case: ఈడీకి రాహుల్ గాంధీ విజ్ఞప్తి
ABN , First Publish Date - 2022-06-16T23:57:36+05:30 IST
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్

న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నలను మూడు రోజులపాటు ఎదుర్కొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదుపరి దర్యాప్తును జూన్ 20కి వాయిదా వేయాలని కోరారు. మరోసారి ప్రశ్నించేందుకు శుక్రవారం హాజరుకావాలని ఆయనను ఈడీ అధికారులు బుధవారం ఆదేశించిన సంగతి తెలిసిందే.
విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, రాహుల్ గాంధీ గురువారం Enforcement Directorateకు చేసిన విజ్ఞప్తిలో తన తల్లి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, జూన్ 17 శుక్రవారంనాటి దర్యాప్తును జూన్ 20 సోమవారంనాటికి వాయిదా వేయాలని కోరారు. ఆయనను ఈడీ అధికారులు సోమ, మంగళ, బుధవారాల్లో ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
కోవిడ్-19తో బాధపడుతున్న సోనియా గాంధీ (Sonia Gandhi) ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రి (Gangaram Hospital)లో చికిత్స పొందుతున్నారు. ఆమెతోపాటు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఉన్నారు.
రాహుల్ గాంధీని సోమ, మంగళ, బుధవారాల్లో ఈడీ అధికారులు ప్రశ్నించారు. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌లో షేర్‌హోల్డింగ్ విధానం గురించి ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాలు ఓ వార్తా సంస్థకు తెలిపాయి.