మోదీ ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడింది : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-01-29T19:02:23+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశ ద్రోహానికి

మోదీ ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడింది : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం ఆరోపించారు. భారత్-ఇజ్రాయెల్ మధ్య 2017లో కుదిరిన ఒప్పందంలో ‘పెగాసస్’ స్పైవేర్ ఓ భాగమని ‘న్యూయార్క్ టైమ్స్’లో ప్రచురితమైన ఓ వ్యాసం వెల్లడించిన నేపథ్యంలో ఆయన ఓ ట్వీట్‌లో ఈ ఆరోపణ చేశారు. 


‘‘ప్రజలు, ప్రభుత్వ నేతలపై గూఢచర్యం చేయడానికి మోదీ ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేసింది. ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా అధికార పార్టీని, ప్రతిపక్షాన్ని, కోర్టును వారు లక్ష్యంగా చేసుకున్నారు. ఇది దేశద్రోహం. మోదీ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడింది’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 


రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఇచ్చిన ట్వీట్‌లో, మోదీ ప్రభుత్వం భారత దేశానికి శత్రువుగా ఎందుకు వ్యవహరించింది? యుద్ధంలో ఉపయోగించే  ఆయుధాన్ని భారతీయులపై ఎందుకు ఉపయోగించింది? అని ప్రశ్నించారు. పెగాసస్‌ను ఉపయోగించి చట్టవిరుద్ధంగా నిఘా పెట్టడం దేశద్రోహమని ఆరోపించారు. ఎవరూ చట్టానికి అతీతులు కాదన్నారు. తాము న్యాయం జరిగేలా చేస్తామన్నారు. 


కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ స్పందిస్తూ, రాహుల్ గాంధీతోపాటు భారతీయులపై నిఘా పెట్టడానికి బీజేపీ ప్రభుత్వం మిలిటరీ గ్రేడ్ స్పైవేర్‌ను ఉపయోగించిందనడానికి ఇది ఎదురులేని రుజువు అని తెలిపారు. దీనికి జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలన్నారు. 


ఆ కథనంలో ఏముంది?

The Battle for the World's Most Powerful Cyberweapon శీర్షికతో న్యూయార్క్ టైమ్స్ ఓ వ్యాసాన్ని ప్రచురించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2017లో ఇజ్రాయెల్‌లో పర్యటించినపుడు ఇరు దేశాల మధ్య దాదాపు 2 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదిరినట్లు ఈ వ్యాసం పేర్కొంది. అత్యాధునిక ఆయుధాలు, ఇంటెలిజెన్స్ గేర్ అమ్మకం కోసం ఈ ఒప్పందాలు కుదిరినట్లు తెలిపింది. ఈ ఒప్పందాల్లో చాలా ముఖ్యమైనవి పెగాసస్ స్పైవేర్, మిసైల్ సిస్టమ్ అని పేర్కొంది. ‘న్యూయార్క్ టైమ్స్’ కథనంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. 


Updated Date - 2022-01-29T19:02:23+05:30 IST