రాఫెల్‌కే భారత్ జై!
ABN , First Publish Date - 2022-06-02T08:24:50+05:30 IST
యుద్ధ విమానాల కొనుగోళ్లలో భారత ప్రభుత్వం రాఫెల్‌కే జైకొట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

114 కాదు.. 57 యుద్ధ విమానాలే
కొనుగోలు సంఖ్యను సగానికి తగ్గించనున్న వాయుసేన
పోటీలో 8 యుద్ధ విమానాలు.. వాటిల్లో రాఫెల్‌కే అవకాశాలెక్కువ
నేవీ ఎఫ్-18కు మొగ్గు చూపితే ఆ ఫైటర్ జెట్ల కొనుగోలుకూ చాన్స్
న్యూఢిల్లీ, జూన్ 1: యుద్ధ విమానాల కొనుగోళ్లలో భారత ప్రభుత్వం రాఫెల్‌కే జైకొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. భారత వైమానిక దళం కోసం.. రూ.1.55 లక్షల కోట్లు(20 బిలియన్ డాలర్లు) వెచ్చించి, 114 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ప్రపంచ కంపెనీలు ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా ఫైటర్ జెట్లను భారత్‌లోనే తయారు చేయాలని, ఆ సాంకేతికతను స్వదేశీ కంపెనీలకు అందజేయాలనే వ్యూహాత్మక భాగస్వామ్య(ఎ్‌సపీ) ఒప్పందాన్ని ప్రతిపాదించింది.ఎనిమిది దిగ్గజ యుద్ధ విమానాలను తయారు చేస్తున్న కంపెనీలు ఈ ఒప్పందానికి సిద్ధమయ్యాయి. వాటిల్లో అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ(ఎఫ్-21), బోయింగ్(ఎ్‌ఫ-15ఈఎక్స్, ఎఫ్/ఏ-18 సూపర్ హార్నెట్), రష్యాకు చెందిన సుఖోయ్(ఎస్-35), మిగ్(మిగ్-35), ఐరోపాకు చెందిన ది యూరోపియన్ కన్సార్టియం(యూరోఫైటర్), స్వీడన్‌కు చెందిన సాబ్(గ్రీపెన్), ఫ్రెంచ్ కంపెనీ దసో(రాఫెల్) ముందుకు వచ్చాయి.
అయితే.. ఇప్పుడు ప్రతిపాదిత యుద్ధ విమానాల కొనుగోలు సంఖ్యను 57కు తగ్గించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ‘బిజినె్సవరల్డ్’ ఓ కథనాన్ని ప్రచురించింది. సాధారణంగా యుద్ధ విమానాల కొనుగోలుతో ప్రభుత్వాల బాధ్యత తీరిపోదు. ఆయా కంపెనీల యుద్ధ విమానాల నిర్వహణ అత్యంత కీలకం. ఇందుకోసం మోడళ్లను బట్టి.. నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాదు.. ఆయా విమానాలను మన దేశం వినియోగించే క్షిపణులు, బాంబులను అనుసంధానించేలా సాంకేతిక/హార్డ్‌వేర్ పరమైన మా ర్పులు చేయాలి. అన్నింటికీ మించి.. ఫైటర్ పైలట్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. పైన పేర్కొ న్న కంపెనీల ఫైటర్ జెట్లలో ప్రస్తుతం భారత్ రాఫెల్‌ను వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహణ, క్షిపణి/బాంబుల వ్యవస్థ అనుసంధానం, పైలట్ల శిక్షణను పూర్తిచేసుకుంది. ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేయనున్న 57 యుద్ధ విమానాలు వేర్వేరు కంపెనీలకు చెందినవైతే.. నిర్వహణ మొదలు.. అన్ని వనరులపై మరింత ఖర్చు తప్పదు. దీంతో రాఫెల్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎఫ్-18కి కూడా?
అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ తయారీ ఎఫ్-18 వైపు కూడా భారత్ మొగ్గుచూపే అవకాశాలున్నాయి. అయితే.. ఇటీవల భారత నౌకాదళం ప్రకటించిన 26 యుద్ధ విమానాల కొనుగోళ్లపై ఈ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. నేవీ కూడా 57 యుద్ధ విమానాల ప్రతిపాదనను 26కు కుదించిన విషయం తెలిసిందే. నేవీకి ఫైటర్ జెట్లను సరఫరా చేసేందుకు రాఫెల్, ఎఫ్-18 యుద్ధ విమానాల తయారీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. మేకిన్ ఇండియాలో భాగంగా వాటిని భారత్‌లోనే తయారు చేసి.. భారతీయ కంపెనీలకు సాంకేతికతను బదిలీ చేస్తామని తెలిపాయి. ఒకవేళ నౌకాదళం ఎఫ్-18ను కొనుగోలు చేస్తే.. నిర్వహణ, శిక్షణ, ఆర్టిలరీ వ్యవస్థల అమరిక విషయంలో ఒప్పందాలను బట్టి.. వాయుసేన కూడా ఈ రకం ఫైటర్ జెట్లకు జైకొట్టే అవకాశాలుంటాయి. అయితే.. రాఫెల్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
