IRSOకు పంచాంగానికి ముడి.. నటుడు మాధవన్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!
ABN , First Publish Date - 2022-06-25T22:24:35+05:30 IST
సైన్స్‌కు పంచాంగానికి ముడిపెట్టిన కోలీవుడ్ నటుడు ఆర్.మాధవన్ (R Madhavan)పై సోషల్ మీడియా ట్రోలింగ్స్‌తో

చెన్నై: సైన్స్‌కు పంచాంగానికి ముడిపెట్టిన కోలీవుడ్ నటుడు ఆర్.మాధవన్ (R Madhavan)పై సోషల్ మీడియా ట్రోలింగ్స్‌తో గుక్కతిప్పుకోనివ్వకుండా చేస్తోంది. సైన్స్ పరమైన విషయాలు మాట్లాడేటప్పుడు నోరు జారితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మాధవన్‌కు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఆయన తొలిసారి దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ (Rocketry: The Nambi Effect) సినిమా జులై 1న విడుదల కాబోతోంది.
ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న వేళ మాధవన్‌పై సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతోంది. కారణం.. ఆయన చేసిన వ్యాఖ్యలే. అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించేందుకు, అంగారకుడి కక్ష్యలోకి అది చేరుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO)కు పంచాంగం బాగా సాయపడిందని మాధవన్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్ర విస్మయం వ్యక్తమవుతోంది. ఆయన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది.
సైన్స్ గురించి తెలియకపోయినా పర్వాలేదు కానీ, ఏవి ఎలా పనిచేస్తాయో తెలియనప్పుడు నోరు విప్పకపోవడం మంచిదని ఓ యూజర్ మాధవన్‌కు సలహా ఇచ్చాడు. ‘మరీ ఇంత మూర్ఖత్వమా?’ అని మరో యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాధవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని, హిందూయిజం శాస్త్రీయమైనదని నిరూపించాలని హిందువులు ఎందుకు అనుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదని, సైన్స్‌ను నిరూపించాల్సిన అవసరం లేకుండా కూడా హిందూ సంస్కృతి గురించి గర్వపడొచ్చని మరొకరు కాస్తంత ఘాటుగానే విమర్శించారు.
‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాను మాజీ శాస్త్రవేత్త, ఇస్రో ఏరోస్పేస్ ఇంజినీర్ నంబి నారాయణ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. కాగా, నంబి నారాయణపై అప్పట్లో గూఢచర్యం ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ సినిమాలో మాధవన్ టైటిల్ రోల్లో కనిపించనున్నారు. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.