అంధకారంలో పుదుచ్చేరి

ABN , First Publish Date - 2022-10-02T09:17:00+05:30 IST

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అంధకారం తాండవిస్తోంది.

అంధకారంలో పుదుచ్చేరి

4 రోజులుగా విద్యుత్తు ఉద్యోగుల సమ్మె

సీఎం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఇళ్లలోనూ ‘కట్‌’

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రోడ్లపైకి 

విద్యుత్తు కోతలతో విసిగి ప్రజల నిరసనలు

విశ్రాంత ఉద్యోగులతో పునరుద్ధరణకు చర్యలు

సమ్మెకు టీ విద్యుత్తు ఉద్యోగుల సంఘీభావం


పుదుచ్చేరి, అక్టోబరు 1: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అంధకారం తాండవిస్తోంది. నాలుగు రోజులుగా విద్యుత్తు ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగడంతో బీజేపీ-అఖిల భారత ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పుదుచ్చేరి వ్యాప్తంగా కరెంటు సరఫరా నిలిచిపోయింది. సీఎం ఎన్‌.రంగస్వామి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ ఇళ్లకూ కరెంట్‌ కట్‌ అయ్యింది. విద్యుత్తు పంపిణీ, రిటైల్‌ వ్యవస్థల్లో 100ు ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగ, కార్మిక సంఘాలు ముందు నుంచి తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. గత నెల 27న కేంద్ర ప్రభుత్వం పంపిణీ, రిటైల్‌లో 100ు ప్రైవేటీకరణకు బిడ్లను ఆహ్వానిస్తూ టెండర్‌ జారీ చేసింది. దీంతో విద్యుత్తు కార్మికులు, ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. మొదటి రెండు రోజులు సమ్మె ప్రభావం పెద్దగా కనిపించకున్నా.. శుక్రవారం నుంచి కోతలు ప్రారంభమయ్యాయి. శనివారం పుదుచ్చేరి వ్యాప్తంగా అంధకారం అలుముకుంది. ఓ వైపు విద్యుత్తు కార్మికులు, ఉద్యోగులు రోడ్డెక్కగా విద్యుత్తు కోతలతో విసిగిపోయిన ప్రజలు రోడ్లపై చేస్తున్న ఆందోళనలతో పుదుచ్చేరి అట్టుడికిపోతోంది. ప్రజల ఆందోళనలతో కరైకాల్‌-తిరువారూర్‌ మధ్య జాతీయ రహదారిపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విపక్షాలు కూడా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. విపక్ష ఎమ్మెల్యేలు శనివారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివాసం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యేల బృందం ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామిని కలిసి.. సమస్య పరిష్కారానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. కాగా.. విద్యుత్తు పంపిణీ వ్యవస్థల ప్రైవేటీకరణతో ఉద్యోగ భద్రతకు ఎలాంటి ముప్పు ఉండబోదని పుదుచ్చేరి లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు.


రంగంలోకి కేంద్రం..

పుదుచ్చేరిలో పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. శుక్రవారం పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఉన్నతాధికారులను పుదుచ్చేరికి పంపింది. శనివారం 24 మంది సాంకేతిక నిపుణులను రంగంలోకి దింపింది. వీరంతా పుదుచ్చేరి విద్యుత్తు శాఖ విశ్రాంత ఉద్యోగులను, కాంట్రాక్టర్లను పిలిపించి.. శనివారం రాత్రికల్లా విద్యుత్తు పునరుద్ధరణకు కృషిచేశారు. అయితే ఇది తాత్కాలికమేనని తెలుస్తోంది.


నేడు అఖిలపక్షం?

పరిస్థితి తీవ్రత దృష్ట్యా పుదుచ్చేరి విద్యుత్తు శాఖ మంత్రి ఎ.నమశ్శివాయమ్‌ శనివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మరోవైపు సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి ఆదివారం అఖిలపక్షం సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. దసరా నవరాత్రుల నేపథ్యంలో సమ్మె సరికాదంటూ కార్మికులు, ఉద్యోగులకు ప్రభుత్వం నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది.


తెలంగాణ ఉద్యోగుల సంఘీభావం

హైదరాబాద్‌, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): కరెంటు పంపిణీ వ్యవస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పుదుచ్చేరి విద్యుత్తు ఉద్యోగుల నిరవధిక సమ్మెకు తెలంగాణ విద్యుత్తు ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు టీఎస్పీఈ జేఏసీ శనివారం దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ కార్పొరేషన్‌(టీఎ్‌సఎ్‌సపీడీసీఎల్‌) కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు జి.సాయిబాబు, పి.రత్నాకర్‌ రావు, పి.సదానందంలు మాట్లాడుతూ.. పుదుచ్చేరిలో విద్యుత్తు పంపిణీ వ్యవస్థను 100ు ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించడం సరికాదన్నారు. పుదుచ్చేరి విద్యుత్తు శాఖ కార్యదర్శితో అక్కడి కార్మికులు, ఉద్యోగులకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయన్నారు. విద్యుత్తు సవరణ బిల్లు-2022ను రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం యత్నిస్తోందని, అదే జరిగితే.. 20 లక్షల మంది ఉద్యోగులు నిరవధిక సమ్మెకు వెళ్తారని హెచ్చరించారు.

Updated Date - 2022-10-02T09:17:00+05:30 IST