కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రియాంక? తెరపైకి వచ్చిన కొత్త ప్రశ్న..!

ABN , First Publish Date - 2022-09-28T23:55:03+05:30 IST

కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి రేసులో ఎవరెవరు ఉంటారు? అధిష్ఠానం మొగ్గు ఎవరిపై ఉండబోతోంది? పార్టీ ప్రజాస్వామ్యం పేరుతో..

కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రియాంక? తెరపైకి వచ్చిన కొత్త  ప్రశ్న..!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి రేసులో ఎవరెవరు ఉంటారు? అధిష్ఠానం మొగ్గు ఎవరిపై ఉండబోతోంది? పార్టీ ప్రజాస్వామ్యం పేరుతో చడీచప్పుడు కాకుండా ఎవరు నామినేషన్ వేయబోతున్నారనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తూనే ఉంది. గాంధీ కుటుంబ సభ్యులు ఎవరూ పోటీలో ఉండరని రాహుల్ గాంధీ తేల్చిచెప్పడంతో కాబోయే కొత్త అధ్యక్షుడు గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తే అవుతారనే అభిప్రాయం దాదాపు స్థిరపడుతూ వచ్చింది. ఆసక్తికరంగా..తాజాగా  ప్రియాంక గాంధీ వాద్రా పేరు తెరపైకి వచ్చింది. భారతీయ సాంప్రదాయం ప్రకారం ఆడబిడ్డకు పెళ్లయిన తర్వాత పుట్టింటి పేరు ఉండదని, అత్తంటి పేరే ఇంటిపేరు అవుతుందని, ఆమెను ఇంకెంతమాత్రం గాంధీ కుటుంబ సభ్యురాలిగా పరిగణించ రాదని కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖలేఖ్ తాజాగా ట్వీట్ చేశారు. 


''భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరోసారి పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడి పదవికి ప్రియాంక గాంధీ సమర్ధులైన అభ్యర్థని నా నిశ్చితాభిప్రాయం. భారతీయ సాంప్రదాయం ప్రకారం చూస్తే, వాద్రా కుటుంబం కోడలైన ప్రియాంకను గాంధీ కుటుంబ సభ్యురాలిగా చూడకూడదు'' అని ఖలేఖ్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.


థరూర్ రెడీ..ప్రధాన పోటీదారెవరు?

పార్టీ అధ్యక్షుడి పదవికి నామినేషన్  వేసేందుకు సీనియర్ నేత శశిథరూర్ సిద్ధంగా ఉన్నారు. అయితే, ఆయన ప్రధాన ప్రత్యర్థి ఎవరనేది ఇంకా డైలమాలోనే ఉంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ‌వైపు పార్టీ అధిష్ఠానం మొదట్నించీ మొగ్గుచూపుతూ వచ్చింది. అయితే ఊహించని విధంగా రాజస్థాన్‌లో తలెత్తిన పరిణమాలతో అధ్యక్ష పదవికి గెహ్లాట్ అభ్యర్థిత్వం డోలాయమానంలో పడింది. రాజస్థాన్‌లో తన అనుచరగణానికే (ఎమ్మెల్యేలు) నచ్చచెప్పలేని గెహ్లాట్... పార్టీ అధ్యక్షుడిగా వ్యవహారాలు ఎలా చక్కబెడతారనే ప్రశ్నలు మొదలయ్యాయి. సీనియర్ నేత కమల్‌నాథ్ ఢిల్లీకి చేరుకున్నప్పటికీ ఆయన అధ్యక్షుడి పదవిపై పెద్దగా మొగ్గుచూపడం లేదు. మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సైతం 'సై' అంటున్నారు. అయితే ఆయన ఆచూతూచి  వ్యవహరిస్తున్నారు.


ఎలాంటి డ్రామా లేదు...

కాగా, రాజస్థాన్‌లో ఎలాంటి డ్రామా జరగడం లేదని, ఒకటి రెండు రోజుల్లో అంతా సజావుగా ముగుస్తుందని పార్టీ  నేత కేసీ వేణుగోపాల్ బుధవారంనాడు మీడియాకు తెలిపారు. అన్ని వ్యవహారాలు ప్రజాస్వామ్యబద్ధంగా, ఎలాంటి ఒడిదుకులు లేకుండా సాఫీగా సాగుతాయని ఆయన భరోసా ఇచ్చారు.


మరో రెండు  రోజులు మాత్రమే...

కాగా, అధ్యక్ష ఎన్నికల నామినేషన్ గడువు మరో రెండు రోజుల్లో...ఈనెల 30వ తేదీతో ముగియనుంది. అక్టోబర్ 1న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఉపసంహరణ గడవు అక్టోబర్ 8వ తేదీతో ముగుస్తుంది. అదో రోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల తుది జాబితా రిలీజ్ అవుతుంది. ఎన్నికే అనివార్యమైతే అక్టోబర్ 17న పోలింగ్ జరుపుతారు. 19న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. 9,000 మందికి పైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డెలిగేట్లు ఓటింగ్‌లో పాల్గొని కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.

Read more