రేపే ప్రధాని పర్యటన

ABN , First Publish Date - 2022-05-25T14:28:23+05:30 IST

రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం చెన్నై రానున్నారు. ఇప్పటికే పూర్తయిన పలు ప్రాజెక్టులను ప్రధాని

రేపే ప్రధాని పర్యటన

- రూ.2900 కోట్ల ప్రాజెక్టులు జాతికి అంకితం

- రూ.28,500 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన

- పది వేలమంది పోలీసులతో ఐదెంచల భద్రత


చెన్నై: రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం చెన్నై రానున్నారు. ఇప్పటికే పూర్తయిన పలు ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయడంతో పాటు పలు భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో రాజకీయ విబేధాలను పక్కనబెట్టి డీఎంకేప్రభుత్వం ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమై పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టింది. గురువారం సాయంత్రం జవర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ అధ్యక్షతన జరిగే సభలో ప్రధాని నరేంద్రమోదీ రూ.2900 కోట్ల వ్యయంతో పూర్తయిన ఐదు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ఆ మేరకు రూ.500 కోట్లతో చేపట్టిన మదురై - తేని మధ్య 75 కిలోమీటర్ల గేజ్‌మార్పిడి ప్రాజెక్టును, రూ.590 కోట్లతో నిర్మించిన తాంబరం - చెంగల్పట్టు మధ్య 30 కి.మీ. మూడో రైలు మార్గాన్ని, రూ.850 కోట్లతో నిర్మించిన ఎన్నూరు - చెంగల్పట్టు మార్గంలో 115 కి.మీ. పొడవైన గ్యాస్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టును, రూ.910 కోట్లతో చేపట్టిన తిరువళ్లూరు - బెంగళూరు మార్గంలో 271 కి.మీ.ల పొడవైన గ్యాస్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. ఇక ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన- అర్బన్‌ పథకం కింద చెన్నై లైట్‌హౌస్‌ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 1152 గృహాల సముదాయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. 


6 ప్రాజెక్టులకు శంకుస్థాపన...

రూ.28,500 కోట్లతో చేపట్టనున్న ఆరు భారీ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఆ మేరకు రూ-.14870 కోట్లతో కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను కలుపుతూ బెంగళూరు - చెన్నై మధ్య నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి, మద్రాసు హార్బర్‌ - మధురవాయల్‌ మధ్య రూ.5850 కోట్లతో చేపట్టనున్న 21 కి.మీ. రెండంతస్తుల ఫ్లైవోవర్‌ నిర్మాణానికి, ధర్మపురి పరిధిలో రూ.3870 కోట్లతో 94 కి.మీ.ల ఫోర్‌వే రహదారి నిర్మాణానికి, చిదంబరం - మీన్‌సురుట్టి మధ్య 31 కి.మీ. మేర రూ.720 కోట్లతో చేపట్టనున్న టూవే రహదారి నిర్మాణానికి, రూ.1800 కోట్ల తో చేపట్టనున్న ఎగ్మూరు, రామేశ్వరం, మదురై, కాట్పాడి, కన్నియాకుమారి రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులకు, చెన్నైలో రూ.1400 కోట్లతో నిర్మించనున్న మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కుకు ప్రధాని మోదీ శంకుస్థాపనచేయనున్నారు.


రెండు గంటల పర్యటనే..

 ఈ నెల 26న  ఒక రోజు పర్యటన నిమిత్తం నగరానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కోసం పది వేల మంది పోలీసులతో ఐదంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటయ్యే సభలో ఆయన కొత్త పథకాలకు శంకుస్థాపన చేయడంతోపాటు ఐదు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ నుంచి భారతవైమానిక దళ విమానంలో బయల్దేరి గురువారం సాయంత్రం ఐదు గంటలకు చెన్నై చేరుకుంటారు. విమానాశ్రయంలో ప్రధానికి గవర్నర్‌ ఆర్‌ఎన్‌, రవి, ముఖ్యమంత్రి స్టాలిన్‌, మంత్రులు స్వాగతం పలుకనున్నారు. చెన్నై విమానాశ్రయం నుంచి బయలుదేరి 5.45 గంటలకు నెహ్రూ స్టేడియం చేరుకుంటారు. మోదీ పర్యటన కోసం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక భద్రతా దళం ఇప్పటికే        విమానాశ్రయం, స్టేడియం పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇదిలా వుండగా ప్రధాని పర్యటన కేవలం రెండు గంటలేనని, సాయంత్రం 7.45 గంటలకు ఆయన తిరిగి వెళ్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 


దారి పొడవునా బీజేపీ స్వాగతం...

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆయనకు యెత్తున స్వాగతం పలికేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేపడుతున్నారు. విమానాశ్రయం నుంచి వేప్పేరిలోని నెహ్రూ స్టేడియం వరకు ప్రధానికి స్వాగతం పలికేందుకు కార్యకర్తలను సమీకరించనున్నారు. రహదారికి ఇరువైపులా వేలాదిమంది కార్యకర్తలు బీజేపీ జెండాలతో స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు గాను ఇప్పటికే సీనియర్‌ నేతలు చర్చించి ప్రణాళిక సిద్ధం చేశారు. మోదీ పర్యటించే మార్గంలో పలు చోట్ల జానపద కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల కోసమే ప్రధాని వస్తుండడంతో అధికార డీఎంకే సైతం ఆయన స్వాగత ఏర్పాట్లకు సహకరిస్తోంది. 

Updated Date - 2022-05-25T14:28:23+05:30 IST