రాష్ట్రపతి ఎన్నికలు నేడే

ABN , First Publish Date - 2022-07-18T07:40:22+05:30 IST

దేశ ప్రథమ పౌరుడు/పౌరురాలిని ఎన్నుకునే కీలక ఘట్టం సోమవారం జరగనుంది.

రాష్ట్రపతి ఎన్నికలు నేడే

బరిలో ఎన్డీయే అఽభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము..

విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా

ఎన్డీయే అభ్యర్థి గెలుపు లాంఛనమే


న్యూఢిల్లీ, జూలై 17: దేశ ప్రథమ పౌరుడు/పౌరురాలిని ఎన్నుకునే కీలక ఘట్టం సోమవారం జరగనుంది. రాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పార్లమెంటు సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం ఈనెల 24న ము గియనున్న నేపథ్యంలో అత్యున్నత రాజ్యాంగ పదవికి నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలను గురువారం వెల్లడిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల బరిలో అధికార ఎన్డీయే మిత్రపక్షాల అభ్యర్థిగా ఆదివాసీ మహిళ, మాజీ గవర్నర్‌ ద్రౌపదీ ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా తలపడుతున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 776 మంది ఎంపీలు, 28 రాష్ట్రాలు, శాసన సభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 4,033 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తారు.


రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆ పార్టీ ఎంపీలకు శనివారం రాత్రి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన 100ు పోలింగ్‌ విజయవంతం కావాలని, ఓటు వేసే సమయంలో పొరపాట్లకు తావులేకుండా వ్యవహరించాలని కోరినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే పార్లమెం టు వర్షాకాల సమావేశాలకు విధిగా హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నాయి. బీజేపీ మిత్రపక్షాలు ముర్ముకు మద్దతు తెలిపాయి.


ఎన్డీయే ఎంపీలతో ముర్ము భేటీ

ఎన్డీయే పక్షాల ఉమ్మడి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ఆయా పార్టీల ఎంపీలతో ఆదివారం భేటీ అయ్యా రు. తనను నామినేట్‌ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీలకు మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. 


దేశాన్ని చైనా చేస్తున్నారు: సిన్హా 

రాష్ట్రపతి ఎన్నికలకు ఒకరోజు ముందు విపక్షాల ఉమ్మ డి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తానని, కానీ, నిత్యం ప్రజాస్వామ్యంపై దాడి చేసే వారు ద్రౌపదీముర్ముకు మద్దతిస్తున్నారని విమర్శించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ‘అన్నీ ఆలోచించి’ తనకు ఓటేసి గెలిపించాలని అన్ని రాజకీయ పక్షాలకు కడసారి విజ్ఞప్తి చేశారు. ‘‘ఈ ఎన్నికలు ఇద్దరు అభ్యర్థుల మధ్య కాదు. రెండు సిద్ధాంతాల మధ్య’’ అన్నారు. ‘‘ప్రజాస్వామ్య దేశాన్ని కమ్యూనిస్టు చైనాగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వన్‌ నేషన్‌, వన్‌ పార్టీ, వన్‌ సుప్రీం లీడర్‌ వంటి నియంతృత్వ పోకడలను నిలువరించాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా ఉం ది. ఇది మీకే(ఎమ్మెల్యేలు, ఎంపీలు) సాధ్యం’’ అని సిన్హా పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్‌లో ‘విగ్రహాల’ను తాము కోరుకోవడం లేదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ అన్నారు.  


ముర్ము, ధన్‌ఖడ్‌ గెలుపు ఖాయం

ఎన్డీయే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థు లు ద్రౌపదీ ముర్ము, జగ్దీప్‌ ధన్‌ఖడ్‌ల విజయం నల్లేరుపై నడకే కానుంది. బీజేపీ అనుకూల పార్టీలు సహా పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీ లు బీజేడీ, వైసీపీ, శివసేన, జేఎంఎం, జేడీ(ఎస్‌), సుహుల్దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ కూడా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించడంతో ఆమె ఎంపిక కావడం లాంఛమేనని తేలిపోయింది.


ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక

వచ్చే నెల 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఎన్డీయే పక్షాల అభ్యర్థిగా జాట్‌ వర్గానికి చెందిన బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ను ఎం పిక చేశారు. కాగా, గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లకు ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం విందు ఇచ్చారు. దీనికి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ధన్‌ఖడ్‌ కూడా హాజరయ్యారు.

Read more