Bihar : నితీశ్ కుమార్‌కు ప్రశాంత్ కిశోర్ భారీ ఆఫర్!

ABN , First Publish Date - 2022-09-15T19:47:35+05:30 IST

ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మళ్లీ జేడీయూలో చేరబోతున్నట్లు

Bihar : నితీశ్ కుమార్‌కు ప్రశాంత్ కిశోర్ భారీ ఆఫర్!

పాట్నా : ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మళ్లీ జేడీయూలో చేరబోతున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయన గురువారం ఇచ్చిన ట్వీట్ ఆ ఊహలకు తెరదించినట్లే కనిపిస్తోంది. రామ్‌ధారి సింగ్ ‘దిన్‌కర్’ రాసిన ‘రష్మిరాఠీ’లోని ఓ పద్యాన్ని ఈ ట్వీట్‌లో గుర్తు చేశారు. జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో ఆయన మంగళవారం రాత్రి సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే ఇది సాధారణ సమావేశమేనని, రాజకీయాలతో సంబంధం లేదని నితీశ్ బుధవారం చెప్పారు. 


ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘మీ సహాయంతో నేను సునాయాసంగా విజయం సాధించగలను, కానీ, రాబోయే తరాలకు నేను ఏ ముఖం చూపించగలను?..... దిన్‌కర్’’ అని పేర్కొన్నారు. 


ఇదిలావుండగా, ప్రశాంత్ కిశోర్‌ను ఉటంకిస్తూ ఓ టీవీ చానల్ తెలిపిన వివరాల ప్రకారం, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) బిహార్‌లో సంవత్సరానికి 10 లక్షల చొప్పున ఉద్యోగాలను ఇచ్చినపుడు మాత్రమే తాను మళ్ళీ ఆయనతో లేదా కూటమితో కలవడం గురించి ఆలోచిస్తానని చెప్పారు. 


2015లో జరిగిన బిహార్ శాసన సభ ఎన్నికల కోసం ఆర్జేడీ, జేడీయూ (RJD-JDU)లను ఏకతాటిపైకి తేవడంలో ప్రశాంత్ కిశోర్ కీలక పాత్ర పోషించారు. 2018లో ఆయనకు జేడీయూ ఉపాధ్యక్ష పదవి లభించింది. అయితే 2019లో పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌరుల జాబితా (NRC)లను ఆయన వ్యతిరేకించడంతో, ఆయనను పార్టీ నుంచి తొలగించారు.


ప్రశాంత్ కిశోర్ ఇటీవల బిహార్‌లో ‘జన సూరజ్’ పేరుతో ప్రజలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది చివరికి ఓ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందవచ్చునని తెలుస్తోంది.


Updated Date - 2022-09-15T19:47:35+05:30 IST