కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు 25 ఎలక్ట్రిక్‌ వాహనాలు

ABN , First Publish Date - 2022-06-05T13:33:26+05:30 IST

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సచివాలయం వద్ద శనివారం ఉదయం ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి

కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు 25 ఎలక్ట్రిక్‌ వాహనాలు

                     - జెండా ఊపి ప్రారంభించిన సీఎం స్టాలిన్‌


చెన్నై, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సచివాలయం వద్ద శనివారం ఉదయం ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారుల ఉపయోగం కోసం కొనుగోలు చేసిన 25 ఎలక్ర్టిక్‌ వాహనాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ జెండా ఊపి ప్రారంభించారు. చెన్నై సహా పలు నగరాల్లో వాహనాల నుంచి వెలువడే కర్బన వాయువుల వల్ల కలిగే వాయు కాలుష్యాన్ని నిరోధించే దిశగా కాలుష్య నియంత్రణా మండలి ఉన్నతాధికారుల కోసం రూ.3.42 కోట్లతో 25 ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ వాహనాలను ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఉపయోగించనున్నారని ఆయన చెప్పారు.


కలెక్టర్లకు హరిత పురస్కారాలు

ఇదేవిధంగా సచివాలయంలో ఏర్పాటైన మరో కార్యక్రమంలో మొక్కల పెంపకం వంటి పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలను చేపట్టిన జిల్లా కలెక్టర్లను ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ హరిత పురస్కారాలను ప్రదానం చేశారు. ఆ మేరకు మదురై కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌. అనీష్‌ శేఖర్‌, విల్లుపురం కలెక్టర్‌ డి. మోహన్‌, తిరువణ్ణామలై కలెక్టర్‌ పి. మురుగేశ్‌ ఈ పురస్కారాలను స్వీకరించారు. 2021 సంవత్సరానికిగాను ఈ పురస్కారాలు అందజేసినట్లు స్టాలిన్‌ తెలిపారు.


కర్మాగారాలు, విద్యా సంస్థలకు

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కాలుష్య నియంత్రణలో పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణను సమర్థవంతంగా అమలు చేసిన కర్మాగారాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వేతర సంస్థలకు కూడా హరిత పురస్కారాలను ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రదానం చేశారు. ఈ పురస్కారం కింద తలా లక్ష రూపాయల నగదును పంపిణీ చేశారు. 2021 సంవత్సరానికి గాను ఈ పురస్కారాలకుగాను 79 సంస్థలను ఎంపిక చేశారు. వాటిలో రాణిపేటలోని టేనరీ ఎఫ్లూయెంట్‌ ట్రీట్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌, పెరుందురైలోని ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాల, తిరుప్పూరులోని సులోచనా కాటన్‌ స్పిన్నింగ్‌ మిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ, నీలగిరి జిల్లా క్లీన్‌ కున్నూరు, స్థానిక పోరూరులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నిర్వాహకులకు హరిత పురస్కారాలను ఆయన ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి సీవీ మెయ్యనాధన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, పర్యావరణ, అటవీశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహు, రాష్ట్ర కాలుష్యనియ్రంతణా మండలి అధ్యక్షులు ఎ ఉదయన్‌, మెంబర్‌ సెక్రటరీ ఇరా కన్నన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-05T13:33:26+05:30 IST