Police: రాత్రి 8 గంటల తర్వాత మెరీనాలో గుంపులుగా చేరొద్దు

ABN , First Publish Date - 2022-12-31T10:47:02+05:30 IST

కొత్త సంవత్సరం రోజున ప్రత్యేక ప్రార్థనలకు నగరంలోని వందకు పైగా దేవాలయాలు, చర్చిలు సిద్ధమవుతున్నాయి.

Police: రాత్రి 8 గంటల తర్వాత మెరీనాలో గుంపులుగా చేరొద్దు

- హద్దుమీరితే చర్యలు తప్పవు

- నగర పోలీసు శాఖ హెచ్చరిక

పెరంబూర్‌(చెన్నై), డిసెంబరు 30: కొత్త సంవత్సరం రోజున ప్రత్యేక ప్రార్థనలకు నగరంలోని వందకు పైగా దేవాలయాలు, చర్చిలు సిద్ధమవుతున్నాయి. ప్రార్థనలకు ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యే అవకాశముండడంతో ఆయా ప్రాంతాల్లో భద్రతను పోలీసు శాఖ కట్టుదిట్టం చేసింది. అలాగే, నక్షత్ర హోటళ్లు, రిసార్ట్‌లు, ఫాంహౌ్‌సలు, క్లబ్‌లు, బార్లలో అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత వేడుకలు నిర్వహించరాదని పోలీసులు ఆదేశించారు.

రాత్రి 8 గంటల తర్వాత బీచ్‌ల్లో అనుమతి లేదు..

నూతన సంవత్సరం సందర్భంగా మెరీనాబీచ్‌(Marina Beach), బీసెంట్‌నగర్‌ ఎలియట్స్‌ బీచ్‌, నీలాంగరై, పాలవాక్కం, కాశిమేడు, తిరువొత్తియూర్‌ సహా పలు సముదర తీర ప్రాంతాల్లో ప్రజలు పెద్దసంఖ్యలో చేరి ఆటపాటలతో సందడి చేస్తూ కేక్‌ కట్‌ చేసి వేడుకులు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం విజృంభిస్తున్న కొత్త రకం కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు ఈ వేడుకలకు పలు ఆంక్షలు విధించారు. బీచ్‌ ప్రాంతాల్లో శనివారం రాత్రి 8 గంటల తర్వాత ప్రజలు గుమిగూడడం, కేక్‌లు కట్‌ చేయడం వంటి కార్యక్రమాలు నిషేధించినట్టు పోలీసు శాఖ వెల్లడించింది. అలాగే, ఆయా ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాల ద్వారా పర్యవేక్షించి, నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని పోలీసు శాఖ హెచ్చరించింది.

16 వేల మంది పోలీసులు...

ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలు జరగకుండా నగర వ్యాప్తంగా 368 ప్రాంతాల్లో ప్రత్యేకంగా గస్తీ చేపట్టడంతో పాటు 16 వేల మంది పోలీసులు బందోబస్తు చేపట్టనున్నారు. అలాగే, నగరం, శివారు ప్రాంతాల్లోని 80 ఫ్లై ఓవర్లను రాత్రి 10 గంటల అనంతరం మూసివేయనున్నారు. ప్యారీస్‌ సమీపంలోని రిజర్వ్‌ బ్యాంక్‌ సబ్‌వే నుంచి యుద్ధ స్మారక స్థూపం, మెరీనా లైట్‌ హౌస్‌ వరకు శనివారం రాత్రి 7 గంటల అనంతరం వాహనాల రాకపోకలు నిషేధించారు. మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపడాన్ని నిరోధించేలా 25 ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి.

Updated Date - 2022-12-31T11:02:24+05:30 IST