ఇరాన్‌లో విద్యార్థులపై విష ప్రయోగం?

ABN , First Publish Date - 2022-12-08T01:26:02+05:30 IST

ఇరాన్‌లో ఒకే రోజు వివిధ యూనివర్సిటీలకు చెందిన 1,200 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

ఇరాన్‌లో విద్యార్థులపై విష ప్రయోగం?

న్యూఢిల్లీ, డిసెంబరు 7: ఇరాన్‌లో ఒకే రోజు వివిధ యూనివర్సిటీలకు చెందిన 1,200 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వర్సిటీల్లోని ఆహారం తిన్న తర్వాత తీవ్రమైన తలనొప్పి, వాంతులతో బాధపడ్డారు. దీంతో మిగతా విద్యార్థులు వర్సిటీల్లోని ఆహారం తినకూడదని నిర్ణయించుకున్నారు. నైతిక పోలీసు విభాగం రద్దుపై అస్పష్టత నేపథ్యంలో ఇరాన్‌లోని నేషనల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ మూడురోజుల పాటు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. మరుసటి రోజు ఆందోళనలు ప్రారంభం అవుతాయనగా.. వర్సిటీల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇరాన్‌ ప్రభుత్వమే విద్యార్థులపై విష ప్రయోగానికి పాల్పడిందని నేషనల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ ఆరోపించింది. గతంలో కూడా ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిందని గుర్తు చేసింది. విద్యార్థులు అస్వస్థతకు లోనైన రోజే వర్సిటీల్లోని క్లినిక్‌లు మూసి ఉండటం ఈ అనుమానాలకు బలాన్నిస్తోంది. అయితే, నీళ్లలోని కలుషిత బాక్టీరియా వల్లే విద్యార్థులకు అనారోగ్యం చేసిందని అధికారులు చెప్తున్నారు. కాగా, ఇరాన్‌లో నిరసనలను హింసాత్మకంగా అణచివేయడాన్ని ఆ దేశ సుప్రీం లీడర్‌ అయతుల్లా ఖమేనీ సోదరి బద్రి హొస్సేనీ తీవ్రంగా ఖండించారు. ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ తమ ఆయుధాలను వదియాల్సిందిగా ఆదేశించాలని ఖమేనీని కోరారు. ఈ మేరకు బద్రి హొస్సేనీ పేరుతో ఉన్న ఓ లేఖను ఆమె కుమారుడు(ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉంటున్నారు) ట్వీట్‌ చేశాడు.

Updated Date - 2022-12-08T01:26:03+05:30 IST