దేశానికి జమ్మూ-కశ్మీరు సరికొత్త మార్గదర్శి : మోదీ

ABN , First Publish Date - 2022-04-24T20:19:29+05:30 IST

జమ్మూ-కశ్మీరు నేడు యావత్తు దేశానికి ఓ సరికొత్త నమూనాను

దేశానికి జమ్మూ-కశ్మీరు సరికొత్త మార్గదర్శి : మోదీ

జమ్మూ : జమ్మూ-కశ్మీరు నేడు యావత్తు దేశానికి ఓ సరికొత్త నమూనాను సమర్పిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పంచాయతీరాజ్ దినోత్సవాల సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ సభలను ఉద్దేశించి ఆదివారం మాట్లాడారు. రూ.20,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. 


జమ్మూలోని పల్లి గ్రామంలో జరిగిన గ్రామ సభలో దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ సభలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణ 370ని రద్దు చేసిన తర్వాత మోదీ తొలిసారి ఇక్కడ పర్యటిస్తున్నారు. ఇక్కడి ప్రజల నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన పర్యటన జరుగుతోంది. 


మార్పునకు నిదర్శనం

పల్లి గ్రామ సభలో మోదీ మాట్లాడుతూ, కశ్మీరులో పంచాయతీరాజ్ దినోత్సవాలను జరుపుకుంటుండటం మార్పునకు నిదర్శనమని చెప్పారు. 100 జన ఔషధి కేంద్రాలను నేడు ప్రారంభిస్తున్నామని, వీటి ద్వారా ప్రజలకు చౌక ధరలకు నాణ్యమైన మందులు లభిస్తాయని చెప్పారు. జమ్మూ-కశ్మీరు నేడు యావత్తు దేశానికి సరికొత్త నమూనాను సమర్పిస్తోందన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో శాసన వ్యవస్థ, అభివృద్ధిలో కశ్మీరు సరికొత్త కోణాన్ని ఆవిష్కరించిందని తెలిపారు. 


క్షేత్ర స్థాయికి ప్రజాస్వామ్యం

జమ్మూ-కశ్మీరులో క్షేత్ర స్థాయికి ప్రజాస్వామ్యం చేరడం అత్యంత గర్వకారణమన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కశ్మీరు లోయలో అమలవుతున్నాయని, వీటివల్ల ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. గతంలో అనేక సంవత్సరాలపాటు రిజర్వేషన్ల వల్ల లబ్ధి పొందలేకపోయినవారు సైతం ఇప్పుడు వాటి వల్ల లబ్ధి పొందగలుగుతున్నారన్నారు. జమ్మూ-కశ్మీరు అభివృద్ధిలో నూతన అధ్యాయ రచన జరుగుతోందని తెలిపారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి రావాలన్న ఆసక్తి అనేకమంది ప్రైవేటు పెట్టుబడిదారులకు ఉందన్నారు. గతంలో జమ్మూ-కశ్మీరు అభివృద్ధి కోసం తయారు చేసిన ఫైలు ఇక్కడికి చేరుకోవాలంటే రెండు నుంచి మూడు నెలల సమయం పట్టేదని, నేడు మూడు వారాల్లోనే చేరుకోగలుగుతోందని చెప్పారు. 


అనుసంధానమే లక్ష్యం

‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి’ కి ఉదాహరణ జమ్మూ-కశ్మీరు అని తెలిపారు. ఇక్కడ పర్యాటక రంగం మళ్ళీ ఊపందుకుంటోందన్నారు. ‘ఒకే భారత దేశం, శ్రేష్ఠ భారత దేశం’ గురించి తాను మాట్లాడినపుడు, తన దృష్టి అనుసంధానంపైనా, దూరాలను కలపడంపైనా ఉంటుందన్నారు. అన్ని కాలాల్లోనూ జమ్మూ-కశ్మీరుకు అనుసంధానాన్ని (కనెక్టివిటీని) కల్పించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. 


కశ్మీరు నుంచి కన్యాకుమారికి ఒకే రోడ్డు

జమ్మూ-కశ్మీరు అభివృద్ధికి నూతనోత్తేజాన్ని అందించడానికి వేగంగా కృషి జరుగుతోందన్నారు. కన్యాకుమారిలోని దేవి కేవలం ఒకే రోడ్డుపై ప్రయాణించి వైష్ణో దేవిని సందర్శించే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. దేశంలోని ప్రతి జిల్లాలోనూ 75 జలాశయాలను పునరుద్ధరించాలనే లక్ష్యంతో అమృత్ సరోవర్ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. మన దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన యోధుల పేరు మీద ఈ సరోవరాలను అభివృద్ధి చేయడానికి సహకరించాలని అందరినీ కోరారు. పంచాయతీలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల స్థితిగతుల గురించి ఆన్‌లైన్ ద్వారా ప్రతి పౌరుడు తెలుసుకోవచ్చునని చెప్పారు. 


మహిళా సాధికారత

పంచాయతీరాజ్‌లో మహిళా సాధికారత కోసం తాము గట్టి కృషి చేస్తున్నామని తెలిపారు. నీటి సంరక్షణ పట్ల మహిళలకు శిక్షణనిచ్చి ప్రోత్సహించాలని పంచాయతీలను కోరారు. మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలన్నారు. వ్యర్థాల నిర్వహణకోసం స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేయాలని పంచాయతీలు, గ్రామ ప్రజలను కోరారు. మనం ఆర్గానిక్ సాగు పద్ధతులవైపు మళ్ళాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది మన దేశం రికార్డు స్థాయిలో పండ్లు, కూరగాయలను ఎగుమతి చేసిందని చెప్పారు. దీని ఫలితాలను చిన్నకారు రైతులు చూస్తారని తెలిపారు. 


వోకల్ ఫర్ లోకల్ 

స్థానిక ఉత్పత్తుల వినియోగం, స్థానిక పరిపాలనలోనే మన దేశాభివృద్ధి దాగుందని చెప్పారు. పార్లమెంటులో అయినా, పంచాయతీలో అయినా మన ప్రతి ప్రయత్నం మన దేశాన్ని నూతన శిఖరాలకు చేర్చుతుందన్నారు. 


కార్బన్ న్యూట్రల్ గ్రామం

సాంబ జిల్లాలోని పల్లి గ్రామం ఆదివారం దేశ చరిత్రలో ఓ రికార్డు సృష్టించింది. మోదీ 500 కేవీ సోలార్ ప్లాంటును జాతికి అంకితం చేయడంతో ఈ గ్రామం కార్బన్ న్యూట్రల్ పంచాయతీగా ఘనత సాధించింది. దీనిని కేవలం సుమారు మూడు వారాల్లోనే నిర్మించడం మరో విశేషం. గ్రామ్ ఊర్జా స్వరాజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా దీనిని నిర్మించారు. 6,408 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 1,500 సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా 340 ఇళ్ళకు క్లీన్ ఎలక్ట్రిసిటీ అందుతుంది. ఈ ప్లాంటును జాతికి అంకితం చేయడంతో సరిహద్దు జిల్లా అయిన సాంబలోని ఈ గ్రామస్థులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2022-04-24T20:19:29+05:30 IST