ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపుపై మోదీ సమీక్ష
ABN , First Publish Date - 2022-03-04T17:51:03+05:30 IST
యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారతీయులను

న్యూఢిల్లీ : యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమం పురోగతిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ అంశంపై మోదీ నిర్వహించిన ఎనిమిదో సమావేశమిది. కీవ్ నగరంలో ఓ భారతీయ విద్యార్థిపై కాల్పులు జరిగిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.
కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, కీవ్ నగరంలో ఓ భారతీయ విద్యార్థిపై కాల్పులు జరిగాయని, ఆయనను ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స చేయిస్తున్నారని తెలుస్తోంది.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మోదీ వరుసగా ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీలతో మోదీ ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ‘ఆపరేషన్ గంగ’ను నిర్వహిస్తున్నారు. ఉక్రెయిన్‌కు పొరుగున ఉన్న నాలుగు దేశాలకు విమానాలను పంపించి, అక్కడి నుంచి భారతీయులను ఉక్రెయిన్ నుంచి తీసుకొస్తున్నారు. ఈ నాలుగు దేశాల నుంచి భారతీయులను రప్పించే కార్యక్రమాన్ని నలుగురు కేంద్ర మంత్రులు పర్యవేక్షిస్తున్నారు.
గురువారం రాత్రి భారత వాయు సేనకు చెందిన మూడు సీ-17 విమానాల్లో 630 మంది హిందోన్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. రొమేనియా, హంగరీల నుంచి ఈ విమానాలు వచ్చాయి. ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి భారత దేశానికి చేరుకున్నవారి సంఖ్య 9,000కు చేరుకున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.