Indo-Russian Relationship : మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-10-28T10:11:39+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Vladimir Putin)

మాస్కో : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Vladimir Putin) ప్రశంసల జల్లు కురిపించారు. మాస్కోలో గురువారం జరిగిన వాల్డాయ్ డిస్కషన్ క్లబ్ (Valdai Discussion Club) సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ, మోదీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుండటం ప్రశంసనీయమని చెప్పారు. మోదీ నాయకత్వంలో భారత దేశంలో ఎంతో కృషి జరుగుతోందని చెప్పారు. మోదీ దేశ భక్తుడని కొనియాడారు.
రష్యా అధ్యక్ష కేంద్రం క్రెమ్లిన్‌కు సన్నిహితంగా ఉండే ఈ మేధావుల క్లబ్ సమావేశాల్లో ప్రతి సంవత్సరం పుతిన్ ప్రసంగిస్తూ ఉంటారు. గురువారం ఆయన మాట్లాడుతూ, ‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎంతో కృషి జరుగుతోంది. ఆయన తన దేశానికి భక్తుడు. ఆయన అనుసరిస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ సిద్ధాంతం అటు ఆర్థికపరంగా, ఇటు నైతిక విలువల పరంగా చాలా ముఖ్యమైనది. భవిష్యత్తు భారత దేశానిదే. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారత దేశం అనే వాస్తవం గర్వకారణం’’ అని చెప్పారు.
బ్రిటన్‌కు వలస రాజ్యంగా ఉన్న భారత దేశం ఆధునిక కాలంలో స్వతంత్ర దేశంగా ఉంటూ అభివృద్ధి చెందుతుండటం గురించి పుతిన్ మాట్లాడుతూ, భారత దేశ వృద్ధి అద్భుతమని తెలిపారు. 150 కోట్ల మంది ప్రజలు, స్పష్టమైన అభివృద్ధి ఫలాలు భారత దేశాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ, మెచ్చుకోవడానికి కారణాలని వివరించారు.
భారత్, రష్యా మధ్య సంబంధాలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు. అనేక దశాబ్దాల నుంచి సన్నిహిత మైత్రీ సంబంధాల బలమైన పునాదులు ఉన్నాయన్నారు. ఇరు దేశాల మధ్య సంక్లిష్ట సమస్యలేవీ ఎన్నడూ ఎదురు కాలేదని, ఒకరికొకరం మద్దతిచ్చుకుంటున్నామని చెప్పారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత దేశ వ్యవసాయ రంగానికి చాలా ముఖ్యమైన ఎరువుల సరఫరాను పెంచాలని మోదీ తనను కోరారని చెప్పారు. వ్యవసాయ రంగంలో వాణిజ్యం దాదాపు రెట్టింపు చేశామని తెలిపారు.
ప్రపంచంపై ఆధిపత్యం చలాయించాలనే లక్ష్యంతో పాశ్చాత్య దేశాలు డర్టీ గేమ్స్ ఆడుతున్నాయన్నారు. బహుళ ధ్రువ ప్రపంచంలో నూతన అధికార కేంద్రాలు త్వరలోనే ఏర్పాటవుతాయన్నారు. మన ఉమ్మడి భవిష్యత్తు గురించి పాశ్చాత్య దేశాలు సమానులుగానే మాట్లాడటం ప్రారంభించవలసి వస్తుందని చెప్పారు. అమెరికా, దాని మిత్ర దేశాల చర్యల వల్ల ఎదురయ్యే పర్యవసానాలు నుంచి ఆ దేశాలే సురక్షితంగా ఉండలేవని చెప్పారు.