Gujarat: సర్దార్ పటేల్ స్టేడియం పేరు మార్చినందుకు ఆదివారం పాటిదార్ల నిరసన

ABN , First Publish Date - 2022-06-11T23:13:42+05:30 IST

సర్దార్ పటేల్ స్టేడియం (మొతెరా క్రికెట్ స్టేడియం)కు ప్రధాన మంత్రి

Gujarat: సర్దార్ పటేల్ స్టేడియం పేరు మార్చినందుకు ఆదివారం పాటిదార్ల నిరసన

గాంధీ నగర్ : సర్దార్ పటేల్ స్టేడియం (మొతెరా క్రికెట్ స్టేడియం)కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరు పెట్టడంపై పాటిదార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్టేడియానికి తిరిగి సర్దార్ పటేల్ పేరునే పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మోదీని గౌరవిస్తామని, అయితే ఈ స్టేడియంకు గతంలో ఉన్న పేరును మార్చకూడదని చెప్తున్నారు. ఇదే డిమాండ్‌తో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. 


ప్రపంచంలోని అతి పెద్ద స్టేడియంలలో ఈ స్టేడియం ఒకటి. ఈ స్టేడియం పేరు మార్చాలని పాటిదార్లు ఓ సమితిని ఏర్పాటు చేశారు. సర్దార్ సన్మాన్ సంకల్ప్ ఆందోళన్ సమితి పేరుతో వివిధ సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. 2015లో పాటిదార్ రిజర్వేషన్ల కోసం ఆందోళన కార్యక్రమాలను నిర్వహించిన పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి కూడా దీనికి మద్దతు పలుకుతోంది. 


ఈ సంఘాలన్నీ కలిసి ఆదివారం బర్డోలీ సూరత్‌లోని స్వరాజ్ ఆశ్రమం నుంచి ప్రదర్శనను ప్రారంభిస్తాయి. సోమవారం సాయంత్రం ఈ స్టేడియం గేట్ నెం.1 వద్ద పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనను నిర్వహిస్తాయి. 


ఈ గ్రూప్ కన్వీనర్ అతుల్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఈ స్టేడియం పేరును మార్చకపోతే తాము తమ నిరసనలను తీవ్రం చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో సర్దార్ పటేల్ విగ్రహాన్ని నిర్మించారని, ఎన్నికలు పూర్తయిన తర్వాత స్టేడియం పేరును మార్చేశారని అన్నారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పేరును దుర్వినియోగం చేయడానికి ఈ ప్రభుత్వాన్ని అనుమతించబోమన్నారు. సర్దార్ పటేల్‌ను తిరిగి గౌరవించాలన్నారు. 


సర్దార్ పటేల్ స్టేడియంను అభివృద్ధిపరచిన తర్వాత దానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరు పెట్టారు. ఈ విధంగా పేరు మార్చడాన్ని పాటిదార్లు వ్యతిరేకిస్తున్నారు. మరికొద్ది నెలల్లో గుజరాత్ శాసన సభ ఎన్నికలు జరగనుండటంతో పాటిదార్లు తమ డిమాండ్‌ను గట్టిగా వినిపిస్తున్నారు. 


Updated Date - 2022-06-11T23:13:42+05:30 IST