Chief Minister: పార్టీ అధ్యక్ష పదవికి నేడు స్టాలిన్‌ దరఖాస్తు

ABN , First Publish Date - 2022-10-07T13:49:40+05:30 IST

డీఎంకే అధ్యక్ష పీఠాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) మరోమారు అధిష్టించనున్నారు. పార్టీ అధ్యక్షపదవికి శుక్రవారం దరఖాస్తు

Chief Minister: పార్టీ అధ్యక్ష పదవికి నేడు స్టాలిన్‌ దరఖాస్తు

                                - కోశాధికారి రేస్‌లో మంత్రి ఈవీ వేలు?


అడయార్‌(చెన్నై), అక్టోబరు 6: డీఎంకే అధ్యక్ష పీఠాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) మరోమారు అధిష్టించనున్నారు. పార్టీ అధ్యక్షపదవికి శుక్రవారం దరఖాస్తు చేయనున్నారు. అధ్యక్షపదవికి స్టాలిన్‌ అభ్యర్థిత్వాన్నే సర్వసభ్యమండలిలోని సభ్యులంతా బలపరుస్తుండటంతో ఆయన ఎకగ్రీవంగా మళ్ళీ ఎంపికకానున్నారు. డీఎంకే 15వ సంస్థాగత ఎన్నికలు ఇటీవలే పూర్తయ్యాయి. గ్రామీణ శాఖ నుంచి జిల్లా శాఖ వరకు అన్ని పదవులకు ఎన్నికలు జరిగాయి. 72 జిల్లా శాఖల కార్యదర్శులకుగాను 71 పదవులకు ఎన్నికలు పూర్తయ్యాయి. దీంతో పార్టీ అధ్యక్షపదవికి, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నెల తొమ్మిదిన డీఎంకే సర్వసభ్యమండలి సమావేశం జరుగనుంది. స్టాలిన్‌ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన తర్వాత ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నికలు జరుగుతాయి. ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ నేత దురైమురుగన్‌ ఎంపిక కావడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పదవిని ఎవరూ ఆశించడం లేదు. ఇక పార్టీ కోశాధికారి పదవికి టీఆర్‌ బాలు మళ్ళీ పోటీచేయనున్నారు. అదే సమయంలో సీనియర్‌ మంత్రి ఈవీ వేలు కూడా కోశాధికారి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం ఆయన కోశాధికారి పదవికి దరఖాస్తు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ లోగా పార్టీ సీనియర్‌ నేతలు ఈవీ వేలుతో చర్చించి పోటీ నుంచి ఆయనను విరమింపజేస్తారని చెబుతున్నారు. దీంతో టీఆర్‌బాలు గతంలా కోశాధికారిగా ఏకగీవ్రంగా ఎంపికకానున్నారు. ఈ పదవులకు దరఖాస్తుల స్వీకరణ శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమవుతుంది. పార్టీ అధ్యక్ష పదవికి సీఎం స్టాలిన్‌(CM Stalin) రెండోసారి దరఖాస్తు చేయనున్నారు. ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు దురైమురుగన్‌, టీఆర్‌బాలు దరఖాస్తులు సమర్పించనున్నారు. ఈ దరఖాస్తుల స్వీకరణ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ సహా సీనియర్‌ నేతలు దరఖాస్తు చేసే కార్యక్రమానికి ఆ పార్టీకి చెందిన అన్ని జిల్లాల నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఇప్పటికే నగరంలోని అన్నా అరివాలయానికి చేరుకున్నారు. 



Updated Date - 2022-10-07T13:49:40+05:30 IST