కశ్మీర్లో మరో పండిట్ హత్య!
ABN , First Publish Date - 2022-08-17T06:41:26+05:30 IST
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకలు మరో కశ్మీరీ పండిట్‌ను బలి తీసుకున్నాయి. షోపియన్ జిల్లాలో మంగళవారం జరిగిన మిలిటెంట్ల దాడిలో సునీల్ కుమార్ అనే కశ్మీర్ పండిట్ కన్నుమూయగా, ఆయన సోదరుడు పింటూ కుమార్ ..

షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి
పండిట్లూ.. లోయను విడిచి వెళ్లిపోండి: కేపీఎస్‌ఎస్
అందరూ ఈ ఘటనను ఖండించాలి: కశ్మీర్ ఎల్జీ సిన్హా
షోపియన్ జిల్లాలో ఉగ్రకాల్పుల్లో మృతి, ఒకరికి తీవ్రగాయాలు..
ఈ ఏడాది 15మంది పౌరుల హత్య
శ్రీనగర్, ఆగస్టు 16: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకలు మరో కశ్మీరీ పండిట్‌ను బలి తీసుకున్నాయి. షోపియన్ జిల్లాలో మంగళవారం జరిగిన మిలిటెంట్ల దాడిలో సునీల్ కుమార్ అనే కశ్మీర్ పండిట్ కన్నుమూయగా, ఆయన సోదరుడు పింటూ కుమార్ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ‘‘చోటిపొరా ప్రాంతంలోని యాపిల్ తోటల వద్ద ఉగ్రవాదులు పౌరులపై కాల్పులు ప్రారంభించారు. ఈ క్రమంలోనే సునీల్ కన్నుమూశారు. ఉగ్రవాదుల కోసం గాలింపు జరుపుతున్నాం’’ అని వారు పేర్కొన్నారు.
గడచిన వారం రోజుల్లో కశ్మీర్లో మిలిటెంట్ల దాడులు మరింత తీవ్రతరం అయ్యాయి. ఆదివారం ఒక పోలీసును, గత వారంలో బిహార్‌కు చెందిన ఒక వలస కూలీని ఉగ్రవాదులు హత్య చేశారు. బుడ్గాం, శ్రీనగర్ జిల్లాలో సోమవారం రెండు గ్రెనేడ్ దాడులు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది మొత్తంగా 15మంది పౌరులు, ఆరుగురు భద్రత సిబ్బంది మిలిటెంట్ల దాడుల్లో కన్నుమూశారు. నలుగురు స్థానికేతర కూలీలను కూడా ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ఇదిలా ఉండగా.. కశ్మీరీ పండిట్ల సామాజిక వర్గానికి చెందిన వారంతా కశ్మీర్ లోయను విడిచి వెళ్లిపోవాలని కశ్మీరీ పండిట్ సంఘర్ష్ సమితి(కేపీఎ్సఎస్) సూచించింది.
జమ్మూ, ఢిల్లీ వంటి ప్రాంతాలకు వారు తమ మకాం మార్చుకోవాలని సూచించింది. ‘‘గడచిన 32ఏళ్లుగా చూస్తున్నాం. ఇక్కడి మైనారిటీలకు అందునా కశ్మీరీ పండిట్లకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇంకెంత కాలం మేమిక్కడ చావాలి? జరిగింది చాలు’’ అంటూ కేపీఎ్సఎస్ చీఫ్ సంజయ్ టీకూ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం దాడికి గురైన వారు, అంతకు ముందు తమ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆశ్రయించారని టికూ పేర్కొనడం గమనార్హం. సునీల్ కుమార్ మృతదేహాన్ని స్థానికులు ఊరేగింపుగా తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.
ఉగ్రవాదులను వదిలేది లేదు
తాజా ఉగ్ర ఘటనపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు పలువురు రాజకీయ నేతలు స్పందించారు. ‘‘ఈ ఘటన వలన కలిగిన బాధను మాటల్లో చెప్పలేను. సునీల్ కుమార్ కుటుంబానికి నా సంతాపాన్ని తెలియచేస్తున్నాను. గాయపడిన ఆయన సోదరుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. నిందితులకు అత్యంత కఠిన శిక్షలు పడాలి. ప్రతి ఒక్కరూ ఈ అమానవీయ చర్యను ఖండించాలి. ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టిన ఉగ్రవాదులను వదిలేది లేదు’’ అని సిన్హా స్పష్టం చేశారు.