Rajnath singh: పీఓకే మనది, మనదిగానే ఉంటుంది

ABN , First Publish Date - 2022-11-30T17:07:34+05:30 IST

పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇండియాకు చెందినదని, సమయం వచ్చినప్పుడు వెనక్కి తెచ్చుకుంటామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి...

Rajnath singh: పీఓకే మనది, మనదిగానే ఉంటుంది

న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (Pakistan Occupied Kashmir) ఇండియాకు చెందినదని, సమయం వచ్చినప్పుడు వెనక్కి తెచ్చుకుంటామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. ఓ జాతీయ ఛానల్‌కు బుధవారంనాడు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను వెనక్కి తెచ్చుకోవడం సహా భారత ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేసేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని నార్తరన్ ఆర్మీ కమాండర్ (Northern Army Commander) లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) ఇటీవల స్పష్టంచేసిన నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

గతంలో కూడా...

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) విషయంలో గతంలోనూ రాజ్‌నాథ్ సింగ్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 27న శ్రీనగర్‌లో జరిగిన ఇన్‌ఫ్రాంట్రీ డే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పీఓకేలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దీనికి పాక్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. పాక్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న కశ్మీర్‌ భూభాగాలను వెనక్కి తెచ్చుకోవాలంటూ 1994లో పార్లమెంటు ఆమోదించిన తీర్మానాన్ని అమలు చేసేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పాకిస్థాన్‌ను ప్రస్తావిస్తూ, భారీ ఆయుధాలు పంపడం, కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి, ఓసీసీలో లేవనెత్తడం వల్ల వాళ్లు సాధించేదేమీ లేదని, అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని, ఆయుధాలు, మాదక ద్రవాలు పంపడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని పొరుగుదేశాన్ని తప్పుపట్టారు.

Updated Date - 2022-11-30T17:10:30+05:30 IST