Indian Tricolour : మన జాతీయ జెండా 14వ శతాబ్దపు గ్రీకు పుస్తకాల్లో!?

ABN , First Publish Date - 2022-12-10T14:04:59+05:30 IST

మన జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని పోలిన జెండాలు 14వ శతాబ్దపు గ్రీకు రాత ప్రతుల్లో కనిపించాయి.

Indian Tricolour : మన జాతీయ జెండా 14వ శతాబ్దపు గ్రీకు పుస్తకాల్లో!?
Indian Tricolor

న్యూఢిల్లీ : మన జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని పోలిన జెండాలు 14వ శతాబ్దపు గ్రీకు రాత ప్రతుల్లో కనిపించాయి. వీటిని మన దేశంలో తొలిసారి ప్రదర్శించబోతున్నారు. గ్రీస్-భారత దేశం (Greece and India) అన్ని రంగాల్లోనూ సత్సంబంధాలను అభివృద్ధిపరచుకోవడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

‘ది రొమాన్స్ ఆఫ్ అలెగ్జాండర్’ అనే గ్రీకు రాత ప్రతిని న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU)లో ప్రదర్శించబోతున్నారు. డిసెంబరు 12 నుంచి 16 వరకు జరిగే సమావేశాల్లో దీని డిజిటైజ్డ్‌ వెర్షన్‌ను ప్రదర్శిస్తారు. ఈ రాత ప్రతి 14వ శతాబ్దానికి చెందినది. ‘ది గ్రీక్ వరల్డ్ అండ్ ఇండియా : హిస్టరీ, కల్చర్ అండ్ ట్రేడ్ ఫ్రమ్ ది హెలెనిస్టిక్ పీరియడ్ టు మోడర్న్ టైమ్స్’ పేరుతో ఈ సమావేశాలను నిర్వహిస్తారు. ఇరు దేశాలకు చెందిన 40 మంది స్కాలర్లు చరిత్ర, సంస్కృతి, సాహిత్య రంగాల్లో ఉభయ దేశాల మధ్యగల అనుబంధం గురించి వివరిస్తారు.

అలెగ్జాండర్ జీవిత చరిత్ర, భారత దేశానికి ఆయన రాక గురించి ఈ రాత ప్రతిలో ఉన్నాయి. దీనికి సంబంధించిన డిజిటైజ్డ్ వెర్షన్‌ను గ్రీస్ నుంచి తీసుకొచ్చారు. వర్తమానంలో, భవిష్యత్తులో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు.

కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి, జేఎన్‌యూ వీసీ శాంతిశ్రీ పండిట్, గ్రీక్ విదేశాంగ మంత్రి నికోస్ డెండియాస్ ఈ సమావేశాల్లో పాల్గొంటారు.

Updated Date - 2022-12-10T14:05:06+05:30 IST