Interpol help : దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు

ABN , First Publish Date - 2022-09-24T18:52:31+05:30 IST

ఆన్‌లైన్‌లో బాలల లైంగిక దోపిడీ, పోర్నోగ్రఫీపై కేంద్ర దర్యాప్తు సంస్థ

Interpol help : దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు

న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌లో బాలల లైంగిక దోపిడీ, పోర్నోగ్రఫీపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) శనివారం విరుచుకుపడింది. ఆపరేషన్ మేఘ్ చక్ర (Operation Megh-Chakra) పేరుతో 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 56 చోట్ల సోదాలు నిర్వహించింది. ఇంటర్‌పోల్ అందజేసిన సమాచారం ఆధారంగా ఈ సోదాలు జరిగాయి. 


విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇంటర్‌పోల్, న్యూజిలాండ్ అందజేసిన సమాచారం సింగపూర్ గుండా భారత దేశానికి చేరింది. చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ మెటీరియల్‌ను పోస్ట్ చేసిన, సర్క్యులేట్ చేస్తున్న వ్యక్తుల సమాచారం దీనిలో ఉంది. ఇంటర్‌పోల్ (Interpol)కు సీబీఐ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఇంటర్నేషనల్ చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఇమేజ్, వీడియో డేటాబేస్ ఇంటర్‌పోల్ వద్ద ఉంది. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ కేసుల్లో ఈ డేటాను ఉపయోగించుకుని దర్యాప్తు చేయడానికి 64 సభ్య దేశాలకు అవకాశం ఉంటుంది. ఈ డేటాబేస్‌లో 2.3 మిలియన్ ఇమేజెస్, వీడియోస్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 10,752 మంది నేరగాళ్ళను, 23,500 మంది బాధితులను గుర్తించడానికి ఈ డేటాబేస్ ఉపయోగపడింది. 


ఆన్‌లైన్ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్‌పై 2021లో ఆపరేషన్ కార్బన్ (Operation Carbon) పేరుతో సీబీఐ దాడులు చేసింది. దేశవ్యాప్తంగా 76 చోట్ల దాడులు చేసి, 83 మందిపై కేసులు నమోదు చేసింది. వీరిలో కొందరిని అరెస్ట్ చేసింది. 


ఆపరేషన్ మేఘ్ చక్ర చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్‌ నిరోధంలో అతి పెద్ద ఆపరేషన్. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్‌ మెటీరియల్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి, వ్యాపింపజేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ జరుగుతోంది. మైనర్లను బ్లాక్‌మెయిల్ చేసేవారిపై కూడా విరుచుకుపడుతోంది. 


ఇదిలావుండగా, సుప్రీంకోర్టు గత వారం చైల్డ్ పోర్నోగ్రఫీ సర్క్యులేషన్‌పై స్పందించింది. చైల్డ్ పోర్నోగ్రఫిక్ మెటీరియల్ సర్క్యులేషన్‌కు సంబంధించిన కేసులను పర్యవేక్షించేందుకు ఉన్న యంత్రాంగం గురించి సవివరమైన నివేదికను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 


Updated Date - 2022-09-24T18:52:31+05:30 IST