Online రమ్మీ నిషేధంపై జస్టిస్ చంద్రూ కమిటీ నివేదిక
ABN , First Publish Date - 2022-06-28T14:17:47+05:30 IST
రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీని నిషేధించే దిశగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రూ నేతృత్వంలోని కమిటీ నివేదిక

చెన్నై, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీని నిషేధించే దిశగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రూ నేతృత్వంలోని కమిటీ నివేదిక సమర్పించింది. సచివాలయంలో సోమవారం ఉదయం జస్టిస్ చంద్రూ, కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను కలుసుకుని ఈ నివేదిక అందించారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ఆన్లైన్ రమ్మీకి వ్యసనపరులుగా మారిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువతీ యువకులు లక్షలాది రూపాయలను నష్టపోయి, అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. పరిస్థితిని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం.. దానిని నిషేధించేందుకు చర్యలు ప్రారంభించింది. ఆ మేరకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రూ నేతృత్వంలో ఈ నెల 10వ తేదీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో ఐఐటీ సాంకేతిక నిపుణులు డాక్టర్ శంకరరామన్, స్నేహ సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ లక్ష్మీ విజయకుమార్, పోలీసు శాఖ అదనపు సంచాలకులు వినీత్దేవ్ వాంఖడే సభ్యులుగా ఉన్నారు. రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని కమిటీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు జస్టిస్ చంద్రూ, కమిటీ సభ్యులు సీఎం స్టాలిన్ను కలుసుకుని నివేదికను సమర్పించారు.
ఆన్లైన్ రమ్మీ నిషేధ చట్టంపై మంత్రివర్గ సమావేశంలో చర్చ!
రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీని నిషేధించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన సోమవారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశం చర్చించింది. ఆన్లైన్ రమ్మీ నిషేధంపై జస్టిస్ చంద్రూ కమిటీ సమర్పించిన నివేదికపై మంత్రివర్గం కూలంకషంగా చర్చించింది. ఆ నివేదిక సిఫార్సుల మేరకు ప్రత్యేక అత్యవసర చట్టాన్ని తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు సమాచారం. అదే సమయంలో రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా కొత్త కట్టుబాట్లను అమలు చేయడంపైనా ఈ సమావేశంలో నేతలు చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, పలు శాఖలకు చెందిన కార్యదర్శులు పాల్గొన్నారు.