తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపుపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయండి
ABN , First Publish Date - 2022-10-14T09:45:16+05:30 IST
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఈసీకి సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికీ ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత రెండు వారాల్లో వాటికి సమాధానం ఇవ్వాలని పిటిషనర్‌కు సూచించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాలంటూ విశ్రాంత ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ పిటిషన్‌ను గత విచారణలో జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పెంపునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌తో జత చేసింది. అయితే, జమ్మూకశ్మీర్ పిటిషన్‌తో తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపునకు సంబంధం ఏమిటని ప్రశ్నించిన ధర్మాసనం.. తెలుగు రాష్ట్రాల అంశాన్ని వేరు చేస్తున్నట్లు తెలిపింది.